ఏలూరు జిల్లా : కైకలూరు క్రైమ్ : ది డెస్క్ :

కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్ 19న నమోదైన గృహ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాత నేరస్తుడైన గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహన్‌రావును అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 16 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు.
స్థానిక వెలమలపేటకు చెందిన జలగం శివ శేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కైకలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కైకలూరు రైల్వే స్టేషన్ రోడ్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించబడ్డ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కంచర్ల మోహన్‌రావుపై గతంలో మొత్తం 41 కేసులు నమోదు కాగా, వాటిలో 29 కేసుల్లో శిక్ష పడినట్లు డీఎస్పీ తెలిపారు. అతనిపై డీసీ షీట్ తెరవనున్నట్లు వెల్లడించారు.
ఇదే సందర్భంగా ఏలూరు ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు గ్రామాలు లేదా పట్టణాల నుంచి బయటకు వెళ్లే సమయంలో పోలీస్ ఎల్‌హెచ్‌ఎంఎస్ (LHMS) యాప్‌ను వినియోగించి తమ ఇళ్లకు రక్షణను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

