- రాష్ట్ర లోకాయుక్త ఆదేశాల అమలుకు అటవీశాఖ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్
చర్యల పట్ల “జంపాన” హర్షం…
కృష్ణా జిల్లా: ఉయ్యూరు : THE DESK NEWS :
కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త “జంపాన శ్రీనివాస గౌడ్” కొల్లేరు ప్రక్షాళనకై గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లేరు సరస్సులోని ఆక్రమిత అక్రమ చేపల, రొయ్యల చెరువులను తొలగించి.. పర్యావరణాన్ని.. అదేవిధంగా, సరస్సులోని జీవరాసులను, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులను రక్షించడం కోసం ఆయన నడుంబిగించారు.
దీనికై ఆయన గతేడాది సెప్టెంబర్ 12న రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర లోకయుక్త ఆదేశాలపై కొల్లేరు ఆక్రమణలపై అటవీ శాఖ ఎట్టకేలకు చర్యలు తీసుకుంటున్నట్లు “జంపాన” “ది డెస్క్” కు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. కొల్లేరులోని ఆక్రమిత చెరువుల తొలగింపునకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.రజని గతేడాది సెప్టెంబరు 26న జారీచేసిన ఆదేశాల అమలుకు రాష్ట్ర అటవీ మరియు పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి జి. అనంతరాము ఎట్టకేలకు ఆలస్యంగానైనా స్పందించారన్నారు.

కొల్లేరులోని ఆక్రమిత చెరువుల తొలగింపునకు తగిన చర్యలను తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ను ఆదేశిస్తూ ఈ నెల 2న అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్. శరవణన్ ఉత్తర్వులు జారీచేశారనీ వివరించారు.

అన్ని ప్రభుత్వశాఖల అధికారులను సమన్వయం తో…
కొల్లేరు సరస్సును G.O. Ms. No.120 Environment, Forests, Science and Technology (For.-III) Dept, Dt.04-10-1999) లోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చేపల చెరువులను తొలగించవల్సిందిగా.. రాష్ట్ర ఉపలోకాయుక్త జస్టిస్ పి. రజని.. అడవులు, పర్యావరణం, సైన్స్ & టెక్నాలిజీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారన్నారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులను సమన్వయం చేసి, కొల్లేరు సరస్సులోని చేపల చెరువులను తొలగించాల్సిందిగా.. రాష్ట్ర లోకాయుక్త తన ఉత్తర్వులలో పేర్కొందన్నారు.
సంబంధిత అధికారులపై చర్యలకై జంపాన ఫిర్యాదు…
కొల్లేరు సరస్సులో వేలాది ఏకరాల అనధికార చెరువులను తొలగించటానికి, ఆ ఆక్రమణలకు కారకులకైన అటవీశాఖ అధికారులపై.. అటవీ, పర్యావరణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు చేసినట్టు “జంపాన”.. “ది డెస్క్” కు తెలిపారు.