🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : కంసాలి కుంట : ది డెస్క్ :
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను కంసాలి కుంట గ్రామంలో ఎంపీడీవో జి.ఆర్ మనోజ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్ మనోజ్ మాట్లాడుతూ..
తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామాల్లో ఉన్న మురుగునీరు వడకట్టబడి భూమి లోపలకి చేరి భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉందని, దోమల నివారణ అవుతాయని తెలిపారు.
100 మీటర్ల సీసీ డ్రైన్ల నిర్మాణానికి సుమారు 5 లక్షలు ఖర్చు అయితే 100 మీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి సుమారు లక్ష నుంచి లక్ష 40 వేల రూపాయలు అవుతుందని తద్వారా ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న మురుగునీరు వ్యవస్థకు మ్యాజిక్ డ్రైన్లు మంచి పరిష్కార మార్గం అని ఆయన తెలిపారు.
ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ఆదేశాల మేరకు మండలంలో అవసరమైన మేర మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, కంసాలి కుంట సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.