The Desk…Vijayawada : అర్జీ అంటే కాగితం కాదు.. ప్ర‌జ‌ల ఆవేద‌న‌

The Desk…Vijayawada : అర్జీ అంటే కాగితం కాదు.. ప్ర‌జ‌ల ఆవేద‌న‌

  • ప‌రిష్క‌రించాల‌న్న త‌ప‌న‌, స‌హ‌నం అవ‌స‌రం
  • స‌మ‌స్య‌ను సంతృప్తి చెందేలా ప‌రిష్క‌రించిన‌ప్పుడే సార్థ‌క‌త‌
  • అర్జీదారుల‌ను కుటుంబ స‌భ్యులుగా భావించి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపండి
  • సీఎంవో పీజీఆర్ఎస్ సెల్ చీఫ్ గ్రీవెన్స్ ఆఫీస‌ర్ డా. సీహెచ్ చిన్నారావు, క‌లెక్ట‌ర్ డా. జి. ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో పీజీఆర్ఎస్ సామ‌ర్థ్య నిర్మాణ శిక్ష‌ణ వ‌ర్క్‌షాప్‌

🔴 ఎన్‌టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా ప్ర‌జ‌లు స‌మ‌ర్పించే అర్జీని కాగితంలా భావించొద్ద‌ని.. వారి వేద‌న‌గా భావించి ప‌రిష్క‌రించాల‌న్న త‌ప‌న‌, స‌హ‌నం ఉన్న‌ప్పుడే అర్జీదారుడు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించి, ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని.. జిల్లా అధికారులు అర్జీదారుల‌ను వారి కుటుంబ స‌భ్యులుగా భావించి ప్ర‌తి అర్జీకి స‌రైన ప‌రిష్కారం చూపాల‌ని సీఎంవో పీజీఆర్ఎస్ సెల్ చీఫ్ గ్రీవెన్స్ ఆఫీస‌ర్ డా. సీహెచ్ చిన్నారావు అన్నారు.

క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) జిల్లాస్థాయి అధికారుల‌కు సామ‌ర్థ్య నిర్మాణ శిక్ష‌ణ వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. పీజీఆర్ఎస్ ద్వారా గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ అధికారి అర్జీని స్వీక‌రించింది మొద‌లు నిర్దేశ గ‌డువులో ద‌ర‌ఖాస్తుదారుడు పూర్తిస్థాయి సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై చీఫ్ గ్రీవెన్స్ ఆఫీస‌ర్ చిన్నారావు సూచ‌న‌లు చేసి, అధికారుల సందేహాల‌ను నివృత్తి చేశారు.

స‌మ‌స్య ప‌రిష్కార సామ‌ర్థ్యం అనేది పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచుతుంద‌ని, ప్ర‌తి అర్జీని స‌హానుభూతితో, నిజాయితీగా పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ప‌రిష్క‌రించాల‌న్నారు. అర్జీ అంటే ఒక కాగితం కాదు.. దాని వెనుక కొంద‌రి జీవితాలు, ఉద్వేగాలు, ఆవేద‌న‌లు ఉంటాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు.

ప్ర‌తి శాఖ‌కు మండ‌ల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ అథారిటీగా ఒక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌ని.. అర్జీని కిందిస్థాయి అధికారికి అప్ప‌గించకుండా గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ అధికారే అర్జీదారునితో ఫోన్లో లేదా నేరుగా క‌లిసి మాట్లాడి, స‌మ‌స్య‌ను సావ‌ధానంగా వినాల‌న్నారు. సున్నిత అంశాల్లో అయితే నేరుగా క‌లిసి మాట్లాడ‌టం మంచిద‌ని పేర్కొన్నారు.

మండ‌ల‌స్థాయిలో ఎంపీడీవో, త‌హ‌సీల్దార్‌, ఎస్‌హెచ్‌వో త‌దిత‌ర అధికారులు అర్జీల ప‌రిష్కారంలో ప్ర‌త్య‌క్ష భాగ‌స్వాములు కావాల‌ని స్ప‌ష్టం చేశారు. అప్పుడే అర్జీల ప‌రిష్కారంలో నాణ్య‌త‌తో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంద‌ని వివ‌రించారు. కిందిస్థాయిలో ప‌రిష్కారానికి వీల్లేని వాటిని స‌రైనవిధంగా పైస్థాయికి పంపాల్సి ఉంటుంద‌ని, అదేవిధంగా అర్జీదారునికి తెలుగులో స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ‌తో ఎండార్స్‌మెంట్ ఇవ్వాల‌ని సూచించారు.

స‌మ‌ర్థ‌వంత‌మైన స‌మ‌స్య ప‌రిష్కారం అనేది కేవ‌లం ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికే కాకుండా అధికారి వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త వృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా జిల్లా క‌లెక్ట‌ర్‌గారి సార‌థ్యంలో పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో విజ‌య‌వంతంగా ముందుకుతీసుకెళ్లాల‌ని చీఫ్ గ్రీవెన్స్ ఆఫీస‌ర్ చిన్నారావు సూచించారు. గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ ఆడిటింగ్‌, ఫీడ్‌బ్యాక్ మెకానిజం త‌దిత‌రాల‌పైనా వ‌ర్క్‌షాప్‌లో వివ‌రించారు.

.స‌మావేశంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కె.పోసిబాబు, వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి మండ‌ల‌, డివిజ‌న్ స్థాయి అధికారులు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.