- ఆయిల్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్
🔴NTR జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు. మార్చి 31న బుక్ చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో సిలిండర్ డెలివరీ అయిన తరువాత సబ్సిడీ జమలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయాన్ని ఆయిల్ కంపెనీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి.
దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అట్టి లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దీపం-2 పథకం పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
ఇప్పటి వరకు 99.22 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్ ను ఉపయోగించారని మంత్రి వెల్లడించారు. దీపం-2 పథకానికి ప్రభుత్వం రూ.2,684 కోట్లు కేటాయించిన విషయం గుర్తుచేశారు.
లబ్ధిదారులు సాధారణ పద్ధతిలో ముందుగా సిలిండర్ కు పూర్తి ధర చెల్లించి బుక్ చేయాలి. పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో డెలివరీ జరుగుతుంది. అనంతరం 48 గంటలలోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది.
ఒక సంవత్సరం లో 3 ఉచిత సిలిండర్లను నాలుగు నెలల వ్యవధిలో బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఏవైనా సమస్యలు, సమాచారం లోపాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ సౌరభ్ గౌర్, ఎండి మనజీర్ జిలానీ, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు (IOC, HPC, BPC) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.