NTR జిల్లా : విజయవాడ : THE DESK :
విజయవాడను ముంచేసిన బుడమేరు చరిత్ర ఏంటి?
బెజవాడను బుడమేరు ముంచేసింది. బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది. దీంతో రెండు లేదా ఆపై అంతస్తులలోనే దాదాపు రెండున్నర లక్షల మంది మూడు రోజులుగా నివాసం ఉంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
పడవలపై వెళ్తూ నీళ్లు, పాలు, ఆహార పొట్లాలను కొందరు అందిస్తున్నారు. వాటితోనే బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం బుడమేరు అని అధికారులు చెబుతున్నారు.
మరి, ఈ బుడమేరు కథేంటి?
ఈ వరద విధ్వంసాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారా?
జలవనరుల నిపుణులు దీనిపై ఏమంటున్నారు?
బుడమేరు చరిత్ర ఏంటంటే…
బుడమేరు, కృష్ణా నదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరే విజయవాడ ముంపునకు కారణమనే చర్చ జరుగుతోంది. అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణా నదిలోకి చేరిన నీరు ఎంత మాత్రం కారణం కాదని, ఈ విధ్వంసానికి ప్రధాన కారణం బుడమేరేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన డీ. రామకృష్ణ చెప్పారు.
బుడమేరు, మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆరిగిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్ళు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి.
సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్ఠంగా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు, మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుండేది.
అందుకే, కృష్ణా నది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరమని డీ. రామకృష్ణ అంటున్నారు.
2005లో భారీ వరదలు వచ్చాయి. దాంతో బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు.
బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ రెండు దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తూ సరిగ్గా సింగ్ నగర్‌కు వచ్చేసరికి పూర్తి విశాలంగా దీని ప్రవాహం ఉంటుంది. అయితే, ఇక్కడే విపరీతమైన ఆక్రమణలు జరిగాయని, దీంతో బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డట్లు అయ్యిందని రామకృష్ణ వివరించారు.
బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైందని, ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసిందని రామకృష్ణ చెప్పారు.
వరదలు ఇలా ముంచెత్తాయి…ఆగస్టు 30, 31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 20, 25 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం చూడలేదని, కేవలం 36 గంటల్లో 26 సెం.మీ పైగా వర్షపాతం నమోదైందని, ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయిందని డీ. రామకృష్ణ చెప్పారు.
ఆ వర్షాన్ని ఇటు ప్రజలు, అటు అధికారులు పెద్దగా పట్టించుకోలేనట్లుంది. ఆదివారం తెల్లవారేసరికి ఈ వరదంతా లోతట్టు ప్రాంతాలకు చేరింది. ముఖ్యంగా, బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీల్లోకి వచ్చింది. ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా ఐదారు అడుగులకు పెరిగి ఇళ్లలోకి చేరింది. ప్రజలు గమనించేలోపే అంతా జరిగిపోయింది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రాలేకపోయారు. సింగ్ నగర్, జక్కంపూడి కాలని, రాజరాజేశ్వరి పేట, అరుణోదయ కాలనీ, నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి.
ముంపునకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే. వీటితో పాటు చిట్టినగర్, పాలఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్సార్ కాలనీ ముంపు బారినపడ్డాయి. వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్)లోకి నీరు చేరింది.
మరోవైపు కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరదనీరు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడింది.
ఊహించని వరద ప్రవాహం..
సాధారణంగా బుడమేరులో వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగలదు. ఆధునీకరణ పనుల్లో భాగంగా బుడమేరు సామర్థ్యాన్ని 17 వేల క్యూసెక్కుల వరకు పెంచేలా ప్లాన్ రూపొందించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 45 వేల క్యూసెక్కుల వరద వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డ్రెయిన్‌కు డైవర్షన్ కాలువ ఉండగా, అక్కడి రెగ్యులేటరుకు 11 గేట్లు ఉన్నాయి.
ఇవి ఎత్తితే ‘పవిత్ర సంగమం’ వద్ద కృష్ణా నదిలో వరద కలుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, వంకలు అన్నీ మైలవరం మీదుగా బుడమేరులో కలిశాయి.
దీంతో వెలగలేరు రెగ్యులేటరీపై ప్రభావం చూపింది. గేట్లు ఎత్తడంతో డైవర్షన్ కాలువకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఈ వరద.. కవులూరు, రాయనపాడు మీదుగా జక్కంపూడి కాలనీ, వైఎస్సార్ కాలనీ, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీలను ముంచెత్తింది.
ముంపు అంతా అక్కడే...
విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని స్థానికులు తెలిపారు.
2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ నివాస కాలనీలు బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదని డీ. రామకృష్ణ చెప్పారు.
“మేం ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఆరేళ్లు అవుతోంది. మంచి లొకాలిటీ అని మాకు తెలిసిన వాళ్లు చెప్తే… రేటు కూడా తక్కువగానే ఉందని కొనుక్కున్నాం. ఇప్పుడు తెలిసింది మేం కొనుక్కున్నది ఈ కష్టం అనుభవించడానికే” అని సింగ్ నగర్‌కు చెందిన వినయ కుమారి చెప్పారు. ఆమె వరదలో చిక్కుకుపోయి మూడు రోజుల పాటు అపార్ట్మెంట్లోనే ఉండిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్లు రక్షించడంతో బయటపడి, ఏలూరులోని తమకు తెలిసినవాళ్లింటికి వెళ్తున్నారు.
బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో కాస్త తక్కువ రేట్లకే ప్లాట్లు, ఇంటి స్థలాలు అమ్మేశారు. మధ్యతరగతి ప్రజలు భారీగా కొనుక్కున్నారు. దీంతో ఇక్కడ మరో నగరమే ఏర్పడింది. మరి ఇలాంటి ప్రాంతాల్లో కట్టడాలకు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనిపై ముఖ్యమంత్రి ఆరా తీసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు చెప్పారు.
‘‘బెజవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం’’ అని రైతు సంఘం నాయకుడు అక్కినేని భవాని ప్రసాద్ అన్నారు.
‘‘కొల్లేరును కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు. అందులోకి వరద నీళ్ళు వేగంగా వెళ్ళే పరిస్థితి లేదు. బుడమేరు చుట్టూ ఆక్రమణలు, కొల్లేరు ముఖ ద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయి’’ అని భవాని ప్రసాద్ అన్నారు.
బుడమేరు ఆక్రమణలే కొంపముంచాయి..
బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని నీటిపారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ డి. రామకృష్ణ అన్నారు.
“20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. విజయవాడ నగరం పక్కన ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు పొంగింది. అప్పుడు విజయవాడలో సగానికి పైగా ముంపునకు గురైంది.
బుడమేరులో ఏటా సాధారణ సీజన్లో గరిష్ఠంగా 11వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. బుడమేరు తీవ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల కిందట బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమనూరు ప్రాంతాల్లో ఉన్న “యూ” టర్నింగ్‌లను సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.
ఆక్రమణలను తొలగించాలి. బుడమేరును దాని గరిష్ఠ సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలి.
విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలి. వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలి’’ అని రామకృష్ణ సూచించారు.
పడవ లేదా ట్యూబే ఆధారం…
విజయవాడలో బుడమేరు ప్రళయం సృష్టించింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాలు మంగళవారం నాటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నీటిమట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు. వారంతా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు.
ఇంకా రామకృష్ణాపురం, అరుణోదయ నగర్ వంటి కొన్ని కాలనీలలో వరద నీరు నిలిచే ఉంది. దీంతో కాలనీల్లో రాకపోకలు సాగించాలంటే పడవ వాడాల్సి ఉంటుంది. కొన్ని చోట్లకు పడవలు కూడా వెళ్లలేకపోవడంతో, స్వచ్ఛందంగా యువకులే తమ వారిని రక్షించుకునేందుకు ట్యూబులను కొనుగోలు చేసి వాటి ద్వారా నీట మునిగిన కాలనీల్లోకి వెళ్తూ, తమ వారిని బయటకు తీసుకుని వస్తున్నారు.కొన్ని చోట్లకు పడవల్లో వెళ్లేందుకు సైతం సాహసం చేయలేకపోతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార, పానీయాలు అందడం లేదు. దీంతో స్థానికులే తాళ్లు కట్టుకుని ఒకరికి ఒకరు ఆహారం, మందులు అందించుకుంటున్నారు.
మరో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెబుతున్నారు.