NTR జిల్లా : విజయవాడ : THE DESK : కృష్ణానదికి వచ్చిన వరదలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ భద్రతపై చర్చ మొదలైంది. తాజా వరదల సమయంలో కొన్ని పెద్ద బోట్లు వరద ప్రవాహంలో కొట్టుకుని వచ్చి ఢీకొనడంతో బ్యారేజ్‌కు చెందిన కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ చర్చ మరింత పెరిగింది.
ఇంతకీ ప్రకాశం బ్యారేజ్ భద్రమేనా?
2009 కృష్ణా నది వరదల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై చర్చ జరగడం, తరువాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన నేపథ్యంలో, వరదలు వచ్చిన ప్రతిసారీ ఆనకట్టలు, బ్యారేజిల భద్రతపై ఇలాంటి చర్చ జరుగుతోంది.
ఇంతకీ ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటో చూద్దాం…
బ్యారేజ్ ఎప్పుడు మొదలైంది?సుదీర్ఘ ప్రతిపాదనలు, సర్వేల తరువాత 1852-1855 మధ్య కృష్ణా నదిపై ఒక ఆనకట్ట కట్టారు. దానిని కృష్ణా ఆనకట్ట అని పిలిచేవారు.
సర్ ఆర్థర్ కాటన్ సహా అనేక మంది ఇంజినీర్లు వివిధ దశల్లో ఈ ఆనకట్ట ప్రతిపాదన, డిజైన్, నిర్మాణాల్లో భాగస్వాములయ్యారు.
అయితే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ ఆనకట్ట స్థానంలో 1954-57 మధ్య ప్రస్తుతం ఉన్న బ్యారేజ్‌ను నిర్మించారు. దీనికి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు. ప్రకాశం బ్యారేజ్ అని పిలుస్తున్నారు.
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు లెక్కల ప్రకారం, 1903 అక్టోబరు 7న పాత ఆనకట్టకు 11 లక్షల 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.
అదే ఇప్పటి వరకూ వచ్చిన గరిష్ఠ వరద. తరువాత కొత్త ఆనకట్టకు 2009 అక్టోబరు 5న 11 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.
ఆ నెలలో అంటే, 2009 అక్టోబరు 2 నుంచి 13వ తేదీ మధ్య వచ్చిన వరద ఒక రికార్డు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై చర్చ మొదలైంది కూడా అప్పుడే.
ప్రస్తుత వరద ఈ కొత్త బ్యారేజ్‌కు రికార్డే కానీ పాత ఆనకట్టతో పోలిస్తే మాత్రం రికార్డు కాదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ లెక్కల ప్రకారం.. సెప్టెంబరు 3, 2024 నాటికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11 లక్షల 39 వేల 351 క్యూసెక్కులు.1903 నాటి వరదతో పోలిస్తే ఇది తక్కువే.ప్రకాశం బ్యారేజ్ ముందు ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఒక ఆనకట్ట నిర్మించారు.‘ఫ్రీ బోర్డు పైనుంచి నీరు పారినా ఏమీ కాదు’ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని మాట్లాడిన పలువురు ఇంజినీర్లు చెప్పారు.
అసలు బ్యారేజ్‌కు ముప్పు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ప్రకాశం బరాజ్ భద్రమని ఎలా అనుకోవచ్చో వివరించారు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కేవీ సుబ్బారావు.
‘‘గతంతో పోలిస్తే వర్షపాతం తీరు (రెయిన్ ఫాల్ ప్యాటర్న్ ) మారుతోంది. ఒకేసారి ఎక్కువ నీరు వస్తోంది. వాగులు ఒకేసారి పొంగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు చాలా వరకు 1950-60ల నాటి డిజైన్లు. అప్పటికీ ఇప్పటికీ వానలు పడే పద్ధతిలో తేడా వల్ల మనకు ఈ ఆలోచన, ఆందోళన కలుగుతోంది. అయితే ఆ సమస్యను కూడా అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇంజినీర్లు నిరంతరం పని చేస్తారు. కాలానుగుణంగా వచ్చే ప్రవాహాల తీరును అధ్యయనం చేస్తూ, పరిస్థితిని అంచనా వేసి, నివేదికలు సిద్ధం చేసి, వరదను ఎంత వరకూ ప్రాజెక్టు తట్టుకోగలదు అనే దిశగా అధ్యయనం చేసి, దానికి తగినట్లుగా సన్నద్ధమవుతారు. ఇదంతా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు పర్యవేక్షిస్తారు. అందులోనూ రెండు మూడు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల విషయంలో ఇది పక్కాగా జరుగుతుంది. కాబట్టి బ్యారేజ్‌కు ఏదో అయిపోతోంది, ఎవరూ పట్టించుకోవడం లేదన్న భయం అక్కర్లేదు’’ అని అన్నారు సుబ్బారావు.
‘‘బ్యారేజ్ గేట్లను నిర్ణీత వరద ప్రవాహాన్ని తట్టుకునేలా చేస్తారు. దాన్ని డిజైన్ ఫ్లడ్ అంటారు. అదీకాక దానిపైన ఇంకొంత ఖాళీ ఉంచుతారు. దాన్ని ఫుల్ బోర్డు అంటారు. దానివల్ల మరింత వరద ప్రవాహాన్ని తట్టుకుంటుంది బరాజ్. అది కూడా దాటితే అప్పుడు, వరద బ్యారేజ్ మీద నుంచి ప్రవహిస్తుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితేమీ రాలేదు. ఒకవేళ అలా ఫ్రీ బోర్డు దాటి నీరు పారినా నష్టమేమీ లేదు. బ్యారేజ్‌కి ఏమీ కాదు.’’ అని వివరించారు సుబ్బారావు.
‘‘ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఒకవేళ బ్యారేజ్ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ మధ్య ఎక్కువ తేడా ఉంటే.. అంటే పైనుంచి వచ్చే నీరు, కింద నుంచి వెళ్ళే నీటి మధ్య ఎక్కువ ఎత్తు తేడా ఉంటే, అప్పుడు ప్రమాదానికి అవకాశం ఉండవచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్‌లో ఆ సమస్య కూడా లేదు. అటు, ఇటు రెండు వైపులా నీటి ప్రవాహ ఎత్తు దాదాపు ఒకేలా ఉంది’’ అన్నారాయన. ఈ వరదల వల్ల ప్రమాదం అంటూ వస్తే ఫ్లడ్ బ్యాంకులకు వస్తుంది తప్ప బ్యారేజ్‌కు ఏమీ కాదు.’’ అంటున్నారు సుబ్బారావు.
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారు ఎన్. కన్నయ్య నాయుడు కూడా బ్యారేజ్ భద్రత గురించి మాట్లాడారు.
‘‘బ్యారేజ్‌కి ఏం కాలేదు. నేను వెళ్లాను. బావుంది. బోట్లు ఢీకొట్టడం వల్ల రెండు కౌంటర్ వెయిట్ బాక్సులు దెబ్బతిన్నాయి. వాటిని మార్చడానికి తగిన ఏర్పాట్లు చేసి వస్తున్నాను. పనులు మొదలు పెట్టారు. వరద తగ్గాక బిగిస్తారు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ ప్రకాశం బ్యారేజ్‌కి ఏ సమస్యా లేదు. బరాజ్ సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుంటోంది. అంతకంటే ఇంకేం కావాలి?’’ అని అన్నారు కన్నయ్య నాయుడు.
ఇటీవల తుంగభద్ర ప్రాజెక్టు విరిగిపోయిన గేట్లు బిగించింది కూడా కన్నయ్య నాయుడే.
‘‘ప్రకాశం బ్యారేజ్ బలంగా ఉంది. ఏం ఢోకా లేదు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ పానెల్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రిపేర్లు సూచిస్తూ ఉంటుంది. ఆ రిపేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం 11.4 లక్షల క్యూసెక్కులను తట్టుకుంది అంటేనే ఇది స్ట్రాంగ్ అని అర్థమైంది. బోట్ల వల్ల జరిగిన నష్టమేమీ లేదు’’ అని చెప్పారు ఇంజినీర్ డి.రామకృష్ణ. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ చీఫ్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా కృష్ణా నది వరద నీరు.
అంకెలలో ప్రకాశం బ్యారేజి
కృష్ణా రివర్ బోర్డు అందిస్తున్న సమాచారం ప్రకారం:
బరాజ్ పొడవు: 1,232.92 మీటర్లు / 4,045 అడుగులు
బ్యారేజ్ నీరు నిల్వ ఉండే విస్తీర్ణం: 30 ఎకరాలు
రెగ్యులేటర్లు: 70
స్లూయిస్‌లు: 14
ఫుల్ రిజర్వాయర్ లెవెల్: 17.39 మీటర్లు /57.05 అడుగులు
నిర్మాణ సమయంలో ఆయకట్టు: 6,79,000 ఎకరాలు
ప్రస్తుత ఆయకట్టు: 13 లక్షల ఎకరాలు
( ఇది ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ అందించిన సమాచారం )
గ్రాస్ స్టోరేజ్(నికర నిల్వ): 371 స్టోరేజీ టీఎంసీలు
డెడ్ స్టోరేజ్: 130 టీఎంసీలు
పాత ఆనకట్టకు వచ్చిన గరిష్ఠ వరద: 11.90 లక్షల క్యూసెక్కులు (1903 అక్టోబరు 7)
ప్రస్తుత బ్యారేజ్‌కు ఇంతకుముందు వచ్చిన గరిష్ఠ వరద: 11.10 లక్షల క్యూసెక్కులు (2009 అక్టోబరు 5)
సెప్టెంబరు 3, 2024 నాటికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 11,39,351 క్యూసెక్కులు