- వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జెసి
- జిల్లాలో ధాన్యం సేకరణ 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు టార్గెట్ పెంపు
ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
రైతుల విజ్ఞప్తి మేరకు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. ఆదివారం ఉంగుటూరు మండలం గోపినాథ్ పట్నం రైతు సేవా కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… శని, ఆదివారం వచ్చిన అకాల వర్షాలకు గాను రైతులు వద్దనుండి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందకుండా వారి సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో వారి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచాలని స్థానిక రైతులు కోరగా, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఇంతవరకు రైతు సేవా కేంద్రాలు ద్వారా 51,32,300 గోనే సంచులను రైతులకు సరఫరా చేసి ఇంతవరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతుల కోరిక మేరకు పెంచిన లక్ష్యానికి అనగా 0.45 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యానికి గాను 11.25 లక్షల గోనెసంచాల అవసరం కాగా ప్రస్తుతం 8,95,410 గోనే సంచులు రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
పెంచిన ధాన్యం కొనుగోలు లక్ష్యానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు రైతులకుఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ట్రక్ షీట్ నమోదు చేసి రైస్ మిల్లులు పంపాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల మేనేజర్ పి.శివరామమూర్తి ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ రవికుమార్, పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.