కృష్ణాజిల్లా : ఇందుపల్లి (ఉంగుటూరు) : ది డెస్క్ :
మనిషి ఆరోగ్యం, నేల సారవంతం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఉంగుటూరు మండలం, ఇందుపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చు అన్నారు. రసాయనిక పద్ధతిలో చేపట్టే వ్యవసాయానికి అధిక పెట్టుబడి పెట్టడంతో పాటు భూసారాన్ని కోల్పోవడం, ఆహారం, నీటి కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడటం వంటి దుష్ప్రభావాలను ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. ఇటీవల జిల్లాలో సంభవించిన బుడమేరు వరదలకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేపట్టిన పంటలు మొక్క వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో ముంపును తట్టుకుని నిలబడ్డాయన్నారు. కానీ రసాయనిక ఎరువులను ఉపయోగించి పండించిన పంటలు ఆ సమయంలో పూర్తిగా దెబ్బతిన్నాయన్న నాటి సంఘటనలను ఆయన గుర్తు చేశారు.
అనుభవం కోసం మొదట తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలని సూచిస్తూ, చేను గట్టును పెద్దదిగా చేసుకుని దానిపైన కూరగాయలు, పండ్లు పండించడం ద్వారా వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూరగాయలు అమ్మకం ద్వారా వచ్చే రాబడి భర్తీ చేస్తుందని, తద్వారా వ్యవసాయానికి సున్నా పెట్టుబడి అవుతుందన్నారు. నేలను సారవంతం చేసుకునేందుకు పొలంలో పచ్చిరొట్టగా నవధాన్యాలను చల్లుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను స్వయం సహాయక సంఘాల సభ్యులు షాపులను ఏర్పాటు చేసి విక్రయించుకుని లాభం పొందవచ్చని సూచించారు. అన్ని ధరల పెరుగుదలతో భవిష్యత్తులో రసాయనిక వ్యవసాయం భారం కానున్నదని చెబుతూ, ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవంతో రానున్న రోజుల్లో ప్రజల్లో కచ్చితంగా మార్పును తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముందు ఆయన గ్రామంలో పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తున్న అభ్యుదయ రైతు కోగంటి శ్రీరామ్ ప్రసాద్ ఇంటిని సందర్శించి ప్రకృతి వ్యవసాయం తీరును పరిశీలించారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారీ విధానాన్ని పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ పార్థసారథి, మండల తహసిల్దారు విమల కుమారి, గ్రామ సర్పంచ్ బండి వెంకటలక్ష్మి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.