The Desk…Tirupati/Venkatagiri : అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవము

The Desk…Tirupati/Venkatagiri : అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవము

  • నేడు శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
  • వెంకటగిరి పట్టణంలో సుమారు 1.65 కోట్ల రూ వ్యయంతో భవన,ధ్యాన మందిర నిర్మాణానికి శంకుస్థాపన.
  • భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మవారి దర్శన భాగ్యం కలిగించాలి.

🔴 చిత్తూరు జిల్లా : తిరుపతి/వెంకటగిరి : ది డెస్క్ :

శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. గురువారం ఉదయం స్థానిక వెంకటగిరిలో వెలసిన శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, స్థానిక శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ కమీషనర్ కె. రామచంద్ర మోహన్, కమిటీ చైర్మన్ గొల్లకుంట మురళి కృష్ణ లో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సమర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. వెంకటగిరి నందు కొలువైన శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర పండుగగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రెండవ సారి ఇక్కడ భక్తులు అమ్మవారి జాతర జరుపుకుంటున్నామన్నారు.

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గత సంవత్సరం నుండి నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం, దాతలు, జిల్లా అధికారులు, శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మద్దతునిస్తున్నారన్నారు.

గతంలో 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్ర పండుగ వాతావరణం ఉండేదని, కూటమి ప్రభుతం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 ఆలయాలకు పెంచి, ప్రతి ఆలయానికి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి జాతరకు 40 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుండి విడుదల చేసిందని, ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ముఖ్యమని భావిస్తోందన్నారు. కరోనా సమయంలో శీతలయాగం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

అమ్మవారికి బంగారు ఆభరణాలు, కిరీటం, స్వర్ణ హస్తాలు, స్వర్ణ పాదాలు చేయాలని సంకల్పించి, కోటి 70 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు తయారు చేశారు. శాశ్వత రాబడి కోసం 72 అంకణాల స్థలాన్ని అమ్మవారి ఆలయ ట్రస్ట్ పేరుతో మార్పు చేసి, కోటి 65 లక్షల రూపాయలతో భవన సముదాయం, ధ్యాన మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

అమ్మవారికి నైవేద్యం పెట్టే స్థలం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఇది అమ్మవారి సంకల్పం అని, దానిని నెరవేర్చడమే లక్ష్యమని తెలిపారు. భక్తులందరూ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం జాతరను ప్రభుత్వ లాంచనాలతో చేయడం సంతోషదాయకమని తెలిపారన్నారు. మీడియా సహకారం కోరుతూ,ఇలాంటి కార్యక్రమాలను భక్తులకు తెలిసే విధంగా ప్రసారమాద్యమాల ద్వారా తెలియపరచాలని కోరారు.

ఈ సందర్బంగా ఎంఎల్ఏ కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించామని, ఈ సంవత్సరం ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఏడు జాతర గతంలో కన్నా చాలా బాగుందని భక్తులు హర్షం వ్యక్తపరిచారు. ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరను విజయవంతం చేయడానికి కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ఈరోజు నిర్వహించుకుంటున్నామని, మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చుచేసి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు.

సుమారుగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కె. రామకృష్ణ, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా యంత్రాంగం అందరం కలిసి ఈ పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరిగిందన్నారు.

జిల్లా యంత్రాంగం అందరూ దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు దగ్గరుండి నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రతికూల వాతావరణం కలగకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆహ్లాదకర వాతావరణం ఈ అమ్మవారి జాతర జరిగే విధంగా కృషిచేసారన్నారు.

అనంతరం వెంకటగిరి పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాశ్వత రాబడి కోసం 72 అంకణాల స్థలాన్ని అమ్మవారి ఆలయ ట్రస్ట్ పేరుతో మార్పు చేసి, కోటి 65 లక్షల రూపాయలతో భవన సముదాయం, ధ్యాన మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.