🔴 అమరావతి : తాడేపల్లి : ది డెస్క్ :
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజినీర్ శేఖర్ లతో కలిసి శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆలయాల పునర్నిర్మాణం, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విడుదల చేయనున్న సిజిఎఫ్ నిధులు, ఆలయాల్లో నిర్వహిస్తున్న ధూపదీప నైవేద్య పథకం అమలు స్థితి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు.
అలాగే రానున్న పుష్కరాలు దృష్ట్యా ఆలయాల పరిసరాలలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు :
పవిత్ర శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
రేపు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రామాలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించబడుతుందని మంత్రి పేర్కొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని, శ్రీరాముడి కరుణాకటాక్షాలను పొందాలని ఆయన కోరారు.
ధర్మం, న్యాయం, సత్యం అనే విలువలకు ప్రతీక అయిన శ్రీరాముడు మనకు ఆదర్శప్రాయుడని మంత్రి ఆనం తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి రామమందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ఈ పవిత్ర సందర్భంగా శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నెలకొనాలని మంత్రి ఆకాంక్షించారు.

