శ్రీకాళహస్తి : ది డెస్క్ :
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టువస్తాలను సమర్పించారు. ముందుగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద మంత్రికి అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, బిజెపి అధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం మంత్రి ఆనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు..
స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
స్వామి వారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు గత సంవత్సరం కంటే బాగా ఈ సంవత్సరం దర్శన ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని అలాగే చేపట్టిన ఏర్పాట్లను ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందన్నారు.
శివం టు శివం రహదారి నిర్మాణం కోసం గతంలో 42 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని భావిస్తే ఇవాళ 20 కోట్ల రూపాయలతో నే పూర్తిచేసి ప్రజలకు, భక్తులకు సేవలు అందించే విధంగా ఆ రహదారిని అందుబాటులోకి తీసుకుని వచ్చి నేడు ప్రారంభించడం జరిగిందనీ తెలిపారు.
శివం నుండి శివం రోడ్డు, గిరి ప్రదక్షణకు అవసరమైన రహదారి నిర్మాణం, సెంట్రలైజ్డ్ టికెట్ కౌంటర్, ధర్మరాజ స్వామి గుడి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్, ఉత్తర గోపురం వైపు సిసి రోడ్డు, కన్స్ట్రక్షన్ షెడ్స్, ప్రచార రథం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. వీటితో పాటు ఎంజీఎం హోటల్ నుండి టూరిస్ట్ బస్టాండ్ వరకు రెవెన్యూ, ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమన్వయంతో మూడున్నర కిలోమీటర్ వరకు కొత్త రోడ్డును మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
శివం టు శివం రోడ్డు మాస్టర్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్ కోసం 5.2 కోట్లతో పార్కింగ్ ఎక్కువ వచ్చేలా మంజూరు చేశామన్నారు. గిరి ప్రదక్షణ రోడ్డు మార్గాన్ని 22 కిలోమీటర్ల కి 9.8 కోట్లుతో పూర్తి చేయడం, గుడిమల్లం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రేణిగుంట హైవే నుండి 2.8 కోట్లు మంజూరు చేసి పనులు చేయడం జరుగుతుందన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రసాదాలు, కైంకర్యాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 16 న స్థానికంగా ఉన్న ప్రజలకు ఉచితంగా దర్శనం ఏర్పాట్లు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈనెల 10 వ తేదీ నుండి ఇప్పటివరకు సుమారుగా రోజుకి 30 వేల మంది స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినప్పటి నుండి గడిచిన నాలుగు రోజుల్లో 1,36,488 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని, మిగిలిన రోజుల్లో కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకునే విధంగా జిల్లా ,పోలీస్ సంబంధిత శాఖల యంత్రాంగంతో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు..

