🔴 నెల్లూరు జిల్లా : సోమశిల : ది డెస్క్ :
సోమశిలలో ఉచిత కంటి శస్త్ర చికిత్స మొబైల్ బస్సు యూనిట్లను ప్రారంభించిన మంత్రి ఆనం
పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యం
5.32 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం
పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా సోమశిలను అభివృద్ధి చేస్తాం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
పేదలకు మెరుగైన కంటి చూపు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్‌రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం సోమశిలలో గుండ్రా సతీష్‌రెడ్డి నేతృత్వంలో హెల్పింగ్ హార్ట్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శస్త్ర చికిత్స మొబైల్ బస్సు యూనిట్లను మంత్రి ఆనం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో సోమశిలలోనే మూడు రోజుల పాటు పేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి చూపు అందించేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఇటీవల ఆత్మకూరులో గుండ్రా సతీష్‌రెడ్డి సహకారంతో నిర్వహించిన మెగా జాబ్‌మేళా ద్వారా సుమారు 600 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడం సంతోషకరమని తెలిపారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి సతీష్‌రెడ్డి చేస్తున్న సేవలు అమోఘమని మంత్రి ప్రశంసించారు.
పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యత : మంత్రి ఆనం
పేదల వైద్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఆనం చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రూ.5.32 కోట్లతో 22 ఆరోగ్య భవనాలు నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన భవనాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. మరో ఆరు నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సోమశిలలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం
సోమశిలను పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. త్వరలోనే ఆప్రాన్, హై లెవల్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సోమశిలలో బోటింగ్, అతిథి భవనాలు, హోటళ్ల నిర్మాణాల కోసం పర్యాటక శాఖ అధికారులతో కలిసి త్వరలో పర్యటిస్తామని అన్నారు. సోమేశ్వరాలయాన్ని పూర్తి చేసి పెంచలకోనతో అనుసంధానం చేసి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని సౌకర్యాలు గల క్యారవాన్‌లతో టెంపుల్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
అనంతసాగరం మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్న ఔత్సాహికులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. సుమారు రూ.50 లక్షలతో సోమశిలలో ఒక్క ఇంచు కూడా మట్టి రోడ్డు లేకుండా సిమెంటు రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. తన హయాంలోనే సోమశిలలో గిరిజన గురుకుల పాఠశాల, ఐటీఐ కళాశాలలను నెలకొల్పామని గుర్తుచేశారు.
అన్ని విధాల సోమశిలను అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పావని, తాళ్లూరి గిరినాయుడు, స్థానిక నేతలు రమణారెడ్డి, లక్ష్మీరెడ్డి, విజయ నర్సింగ్ రెడ్డి, శంకర్ నేత్రాలయ సభ్యులు రంజిత్, వైద్యులు గజేంద్ర కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

