- స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్
- వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు
- పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: ఎమ్మెల్సీ సోమువీర్రాజు
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. 16వ వార్డు ఆవా వాంబే గృహ సముదాయాల వద్ద శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’లో భాగంగా చేపట్టిన బీట్ ద హీట్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలసి ఆయన పాల్గొన్నారు. తొలుత బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నగరంలో పటిష్టంగా అమలుపరుస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ మూడో శనివారం ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. వేసవి ఎండల రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. నగరవ్యాప్తంగా ఇప్పటికే 40 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఎండతీవ్రత లేకుండా ఉండేందుకు నెట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు చుట్టూ ఉన్న మరో 10 పంచాయతీలు కలుపుకుని మొత్తం 6,560 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజ నిర్మాణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటాలన్నారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం ద్వారా 95 శాతానికి పైగా మొక్కలను కాపాడుకోవచ్చన్నారు.
ప్రతిఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని.. విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్న ఖాళీ ప్రదేశం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు మంజూరైనట్లు కమిషనర్ తెలిపారు. పచ్చదనం పరిఢవిల్లేలా చుట్టూ మొక్కలతో ఓ బయో ఫెన్సింగ్ ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతిఒక్కరూ నెలలో మూడవ శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్ళరాదన్నారు. ఎక్కువ ద్రవ పదార్ధాలు, ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలిపారు. మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి తమ ఇంటి పరిసరాల్లో వాటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టిలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపులను ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర గ్రేడింగ్ లో రాజమహేంద్రవరం మెరుగైన ఫలితాలు కనబరచడం సంతోషదాయకమన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు.
మొక్కలు ఎన్ని నాటామో ముఖ్యం కాదని.. ఎన్నింటిని పరిరక్షించామన్నది ముఖ్యమని ఎమ్మెల్సీ అన్నారు. కనుక భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం ప్రజల చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తదననంతరం స్థానికులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలను నాటారు.
కార్యక్రమంలో అడిషినల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సెక్రటరీ జి.శైలజావల్లి, సూపరిటెండింగ్ ఇంజనీర్ ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ వినూత్న, నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ యానపు యేసు, డివిజన్ ఇంఛార్జి వరప్రసాద్, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.