🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నగరంలో గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అందులో వసతులు చూస్తే వాటిని విశ్రాంతి మందిరాలు అనొచ్చు. కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన విశ్రాంతి కేంద్రాలను మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు.

చారిత్రక, ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలోని గోదావరి తీరానికి భక్తులు స్నానాల కోసం వస్తుంటారు.
వారిని దృష్టిలో పెట్టుకొని ‘స్వచ్ఛ నగరం’ లక్ష్యంగా రూ.10 లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అందుబాటులోకి తెచ్చారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో భాగంగా సౌకర్యాలు కల్పించారు.
స్నానాలు చేసేందుకు వసతులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక గదులు, పిల్లలను నిద్రపుచ్చేందుకు ఊయల, నాప్కిన్ యంత్రం ఏర్పాటు చేశారు. విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లూ ఉన్నాయి.
గులాబీ టాయిలెట్లను త్వరలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. 2027లో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరితీరాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏర్పాట్లని కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు.