The Desk…Peddapuram, Jaggampeta : ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్

The Desk…Peddapuram, Jaggampeta : ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ జిల్లా : పెద్దాపురం, జగ్గంపేట : ది డెస్క్ :

రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం పెద్దాపురం మండలం జే.తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రాపల్లి గ్రామాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షంతో కల్లాలలో తడిచిపోయిన ధాన్యాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి; జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

కల్లాల్లో ధాన్యం ఎండబెట్టుతున్న రైతులతో మాట్లాడి కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. భోజనం విరామం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం చీడిగా హైవే రోడ్డుపై తడిచిపోయిన ధాన్యాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా రైతులకు అపార నష్టం కలిగిందన్నారు.

ఈ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం బాధ్యత తీసుకుని కొనుగోలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి హడావిడిగా రైతులు ఎవరూ తొందరపడి దళారులు, మధ్యవర్తుల బారినపడి తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని మంత్రి హితవు పలికారు. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 59 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కనుగోలు చేయడం జరిగిందన్నారు. 95 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరకు మాత్రమే ప్రతి ఒక్క రైతు ధాన్యాన్ని అమ్ముకోవాలని ఆయన తెలిపారు. గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కూటమి ప్రభుత్వం కనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదసరిగా 11 వేల 300 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో జమ చేసామని తెలిపారు.

కాకినాడ జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందితోపాటు గోనె సంచలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వరుసల ప్రభావం కొన్ని ప్రాంతాల మీద అధికంగా పడిందని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎవరు అపోహలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మంత్రి పర్యటనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెడెం దొరబాబు, పౌరసరపల సంస్థ మేనేజర్ ఎం.దేవులా నాయక్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, సహకార శాఖ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.