The Desk…Pedavegi : ఆయిల్ పామ్ గెలలు ఏరివేత పట్ల రైతులు ఆగ్రహం… నిరసన ధర్నా..!!

The Desk…Pedavegi : ఆయిల్ పామ్ గెలలు ఏరివేత పట్ల రైతులు ఆగ్రహం… నిరసన ధర్నా..!!

  • రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫెడ్ కర్మాగారం ముందు రైతులు నిరసన ధర్నా
  • గ్రేడింగ్ పేరుతో ఆయిల్ పామ్ గెలల ఏరివేత ఆపాలి.కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలి

ఏలూరు జిల్లా : పెదవేగి : THE DESK NEWS :

పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపాలని.. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆయిల్ పామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ పామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రేడింగ్ పేరుతో ఏరివేసిన గెలలతో ఆయిల్ పామ్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా రైతు సంఘం నాయకులు ఏరివేసిన గెలలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయిల్ రికవరీ శాతం (ఓ.ఇ.ఆర్) పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడం అన్యాయమని విమర్శించారు. పెట్టుబడి పెట్టి రైతులు ఎంతో కష్టపడి చేసిన గెలలు ఏరివేయడంతో ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత మిషనరీతో ఆయిల్ ఫెడ్ కర్మాగారం నడుస్తోందని.. రికవరీ శాతం పెంచాలని ప్రభుత్వం, ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు ఆదేశాలతో పక్వానికి వచ్చిన గెలలు సైతం ఏరివేయడం తగదన్నారు.

నూతన టెక్నాలజీ మిషనరీతో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయకుండా పాత మిషనరీతో రికవరీ శాతం పెంచడం ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులు గురిచేసి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఉందన్నారు. రైతుల తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణానికి నిధులు కేటాయించి ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలన్నారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆయిల్ పామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నె బాబూరావు మాట్లాడుతూ.. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, దిగుబడి రావడంలేదని చెప్పారు. ఆయిల్ పామ్ గెలల ధర కాస్త పెరిగిందని రైతులు సంతోషిస్తున్న ఈ సమయంలో దిగుబడి రాక నష్టపోతున్నామని, పైగా గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరి వేయడంతో మరింతగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయిల్ ఫెడ్ యాజమాన్యం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.అనంతరం ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ తో రైతు సంఘం నాయకులు ఫోన్లో సంప్రదించగా సమస్యను పరిష్కరిస్తామని, రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.

కార్యక్రమంలో పెదవేగి, లింగపాలెం మండలాలకు చెందిన ఆయిల్ పామ్ రైతులు తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి.మురళీ,జాస్తి ధర్మారావు, ఎన్ శ్రీనివాసరాజు, బి.రామచంద్ర రావు,మంతెన జగన్మోహన రావు, బి.వీరవెంకటసుబ్బారావు, గుదిబండి రమేష్ రెడ్డి పలువురు ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు.