The Desk…Pedana : హక్కుల రికార్డును అందించేదే స్వమిత్వ పథకం : జిల్లా కలెక్టర్

The Desk…Pedana : హక్కుల రికార్డును అందించేదే స్వమిత్వ పథకం : జిల్లా కలెక్టర్

కృష్ణాజిల్లా : పెడన : ది డెస్క్ :

గ్రామీణ ప్రాంతంలో సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పరిష్కారాన్ని అందించడం స్వమిత్వ పథకం లక్ష్యం అని, జాగ్రత్తలు పాటిస్తూ సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పెడన మండలం నేలకొండపల్లి, మడక గ్రామాలలో పర్యటించి స్వమిత్వ సర్వే పురోగతిని పరిశీలించారు. తొలుత ఆయన మండలంలో నేలకొండపల్లి గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో స్వమిత్వ సర్వేకు సంబంధించి సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్లు, మ్యాప్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.

సర్వేకు ముందు గ్రామసభలు నిర్వహించడంతో పాటు సంబంధిత ఇంటి యజమానికి నోటీసుల ద్వారా తెలియజేస్తున్నారా లేదా, సర్వేలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆయన అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. ఈ క్రమంలో మడక గ్రామ సచివాలయమును సందర్శించి సర్వే పురోగతిని పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఖచ్చితమైన సరిహద్దులతో సర్వే చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించడం స్వమిత్వ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. నేలకొండపల్లి గ్రామంలో ఇదివరకే సర్వే నిర్వహించడం జరిగిందని, ఆ సమయంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు, అందుకు అనుసరించిన విధి విధానాలు గురించి సంబంధిత అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నామనారు.

తద్వారా మిగతా గ్రామాలలో జరిగే సర్వేకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లా పంచాయతీ అధికారి జే అరుణ, భూ రికార్డులు ల్యాండ్ సర్వే ఏడి జోషిలా, తహసిల్దార్ అనిల్, సర్వేయర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.