The Desk…Pamarru : విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర

The Desk…Pamarru : విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర

  • టీచింగ్ ను ప్రేమించండి.. సబ్జెక్టుపై పట్టు సాధించండి..

ఓరియంటేషన్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : పామర్రు: ది డెస్క్ :

టీచింగ్ ను ప్రేమించండి.. సబ్జెక్టుపై పట్టు సాధించండని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. శనివారం సాయంత్రం పామర్రు మండలంలోని పామర్రు మహిళా ప్రగతి కోచింగ్ సెంటర్ లో మెగా డీఎస్సీ –2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు జరుగుతున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఉత్తమ బోధనపై మెళకువలు బోధించారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎలా ఎదగాలి, సబ్జెక్టుపై పట్టు సాధించడం, ఉపాధ్యాయులు విద్యార్ధుల సంబంధం, వ్యక్తిగత, సంస్థాగత అభివృద్ధి తదితర అంశాల పట్ల బోధించి వారికి అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టును నేర్చుకోవడంలో ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని, అందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని, నేర్చుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.

మాతృభాష తెలుగు, ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తేనే విద్యార్థులకు ఉత్తమంగా బోధించగలరని చెబుతూ మొదట మాతృ భాషను సక్రమంగా నేర్పిస్తేనే పిల్లలు ఆంగ్ల భాష నేర్చుకోగలరని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.మీ సొంత పిల్లల్ని ప్రేమించినట్లే విద్యార్థులను ప్రేమించాలని తద్వారా, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుందన్నారు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన గొప్ప వ్యక్తుల గురించి పిల్లలకు బోధిస్తూ స్ఫూర్తిదాయకమైన కథలతో వారిలో స్ఫూర్తిని నింపాలని సూచించారు.

అదేవిధంగా డ్రగ్స్ కు అలవాటు పడిన, వినియోగించిన వారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని, వారి జీవితాలను బాగు చేయడంలో బాధ్యత వహించాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధి, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతూ యోగా, వ్యాయామాలు రోజువారి దిన చర్యలో భాగం చేసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి పీవీజే రామారావు, పామర్రు మండల ప్రత్యేక అధికారి గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఎంపీడీవో జ్యోతి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.