The Desk…Ongole : వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణం : మంత్రి ఆనం

The Desk…Ongole : వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణం : మంత్రి ఆనం

ఒంగోలు జిల్లా : ఒంగోలు : ది డెస్క్ :

వందేమాతరం గీతం భారతీయులందరికీ గర్వకారణం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం ప్రకాశం భవనం సమీపంలోని చర్చి సెంటరు, అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు మానవహారంగా ఏర్పడి ఈ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ: భారతీయులందరూ ఒకటేనని ఐక్యతను చాటుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతం గొప్పదనాన్ని మరోసారి నేటి తరానికి కూడా తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ గీతాలాపనకు పిలుపునిచ్చిందన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. తరాలు మారినా
వన్నెతెరగని గీతం వందేమాతరం అని చెప్పారు. దీని విశిష్టతను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ.. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజల్లో శక్తిని నింపిందని అన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కోట్లాదిమందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిందన్నారు.

నాటి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా ఏడాది పాటు ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు చెప్పారు. కార్యక్రమం లో స్థానిక మంత్రి డోలా బాల వీర స్వామి, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.