- నూజివీడులో జరిగిన కమ్మవారి వన సమారాధనకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ మహేష్ కుమార్.
ఏలూరు జిల్లా : నూజివీడు : THE DESK :
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల వరదాయని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని రానున్న ఐదేళ్లలో తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
నూజివీడు సమీపంలోని మామిడి తోటలో ఆదివారం జరిగిన కమ్మవారి వన సమారాధన కార్యక్రమానికి ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయటం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం గడువులోపు పూర్తి చేయడం జరుగుతుందని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విధులు విడుదల చేయగా, డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. ప్రాంతంలో అత్యధికంగా మామిడి సాగు చేస్తున్న నేపద్యంలో త్వరలో రైతులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారని ఎంపీ తెలిపారు.
ఇప్పటికే పామ్ ఆయిల్, ఆక్వా, పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానని, అలాగే మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి దృష్టి సారించినట్లు ఎంపీ స్పష్టం చేశారు. నూజివీడు నియోజకవర్గ ప్రాంతంలో మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ వెల్లడించారు.
తాను ఎంపీగా విజయం సాధించిన నాటి నుంచి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
అంతకు ముందు దివంగత నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, తెదేపా నాయకులు కాపా శ్రీనివాసరావు, అక్కినేని చందు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, నందిగం సీతారామ తిలక్, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.