THE DESK NEWS : మత్స్యకారులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 217 రద్దు హర్షణీయం : అండ్రాజు శ్రీను

THE DESK NEWS : మత్స్యకారులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 217 రద్దు హర్షణీయం : అండ్రాజు శ్రీను

ఏలూరు జిల్లా, కలిదిండి, (ద డెస్క్ న్యూస్) : మత్స్యకారులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 217 రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర మత్స్యకార నాయకుడు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు అన్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారుల ఉనికికి ఉపాధికి విఘాతం కలిగించే విధముగా జీవో నెంబర్ 217 పెట్టి మత్స్యకారుల పొట్ట కొట్టి ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ఈ జీవో రద్దు చేయాలని గత ప్రభుత్వం మీద తెలుగుదేశం, జనసేన పార్టీలు అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వము జీవో రద్దును ఉపసంహరించలేదన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవోను రద్దు చేస్తామని మత్స్యకారులకు భరోసా ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మత్స్యశాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు అసెంబ్లీలో జీవో నెంబర్ 217 రద్దు చేస్తామని ప్రకటించడంతో మత్స్యకారులందరూ సంతోషపడుతున్నారని తెలిపారు. అలాగే జీవోని రద్దు చేస్తామన్న హామీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొల్లు రవీంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘ నాయకులు మోక రాంబాబు, కోపనాతి విష్ణు, పొన్నాల తాతారావు, అండ్రాజు బంగారయ్య, కోపనాతి లక్ష్మీనారాయణ, తిరుమల శెట్టి నాగరాజు, కొక్కిలిగడ్డ భాస్కరరావు, తిరుమల శెట్టి ఈశ్వర పరశురాముడు, పొన్నాల కొండలరావు, తిరుమల శెట్టి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.