ఏలూరు జిల్లా, ఏలూరు, THE DESK NEWS : జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో నాబార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPO) ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ద్వారా అధిక రాబడి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అన్ సీజన్ వాటి ధర తక్కువగా ఉంటుందని, వాటికి డిమాండ్ ఉన్న సమయంలో అమ్మకాలు సాగించేలా వాటిని నిర్జలీకరణ (డిహైడ్రేట్) విధానం లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కోకో పంట ఎక్కువగా ఉంటుందని, వాటితో రైతుల ద్వారా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలలో మహిళలు ఇంట్లోనే ఎక్కువగా తయారుచేసే, ప్రాచుర్యం కలిగిన హోమ్ మేడ్ చాకిలేట్ లను ఏలూరు జిల్లాలో కూడా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూజివీడు మామిడి రసాలు దేశవ్యాప్తంగా బ్రాండ్ ను కలిగిఉన్నాయని, వాటికి రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘము లో కనీసం 300 మంది సభ్యులు ఉండాలని, జిల్లాలో ప్రస్తుతం 17 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించడంతో పాటు, సబ్సిడీపై యాంత్రీకరణ కూడా అందించడం జరుగుతుందన్నారు. పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేసి, జిల్లాలో పెద్దఎత్తున రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆర్థికాభివృద్ధికి చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు ను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో నాబార్డ్ డిడిఎం అనీల్ కాంత్, వ్యవసాయశాఖ జెడి ఎస్ కె అబీబ్ భాషా, డిఇఓ ఎస్. అబ్రహాం, అసిస్టెంట్ ఎల్డిఎమ్ చంద్రశేఖర్, ఉధ్యానవనశాఖ డిడి రామ్మోహన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
