ఏలూరు జిల్లా, వేలేరుపాడు (ద డెస్క్ న్యూస్) : వరద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలం శివకాశీపురంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో వరద సహాయ చర్యలపై శనివారం రాష్ట్ర హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడులతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లడుతూ.. వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సహాయ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని, అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వరద సహాయ కేంద్రాలలో పారిశుధ్యం, వైద్య కేంద్రాలు ఉండాలన్నారు. వరద ప్రమాదం పూర్తి తగ్గేవరకూ అధికారులు అప్రమత్తతో ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, 5 రకాల కాయగూరలు కేజీ చొప్పున అందించాలని, వరద పూర్తి స్థాయిలో తగ్గిన అనంతరం పునరావాస కేంద్రాల నుండి వారి ఇళ్లకు వెళ్లే ప్రజలకు కుటుంబానికిఇ 3 వేల రూపాయలు చొప్పున అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ , జేసీ పి . ధాత్రిరెడ్డి, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ప్రభృతులు పాల్గొన్నారు.