🔴 నెల్లూరు జిల్లా : నెల్లూరు : డెస్క్ :
రాష్ట్రంలో నిర్మించిబోయే ఐదువేల దేవాలయాలకు సంబంధించిన నిధులు భక్తుల నుండి వచ్చినవేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక మంత్రి వారి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. రానున్న ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రాష్ట్రంలోని దళిత గిరిజన వాడలలో 5000 గుడులు నిర్మించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మనుగడ కోల్పోయిందని మంత్రి ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.
గత వైసీపీ పాలన లో అనేక దేవాలయాల్లో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయని ఉదాహరణకు కొండ బిట్రగుంట వద్ద రథం దగ్ధం చేయడం, ప్రముఖ క్షేత్రం అయినా అంతర్వేది లో రధం తగలబడటం, అదేవిధంగా నాయుడుపేట లోని ఆంజనేయస్వామి విగ్రహానికి తోకను కత్తిరించడం, విజయవాడ అమ్మవారి దేవస్థానం లో వెండి సింహాలు మాయం అవ్వడం, జరిగిందని ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయని ఆయన తెలిపారు. వైసీపీ పాలన లో భగవంతునికి రక్షణ, భద్రత లేకుండా ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు విజయవాడ లో కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వేల జ్యోతుల కాంతిలో విరాజిల్లుతుందని తెలిపారు.
హిందూ ధర్మ మనోభావాలు దెబ్బ తినకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. హిందూ ధర్మంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని. దేశ ప్రధాని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆ దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు.
దుప దీప నైవేద్యాలకై సుమారు 5523 దేవాలయాలకు నెలకు పదివేల రూపాయలు చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా అర్చకులకు కూడా జీతం పెరుగుదల జరిగిందన్నారు. వేద అధ్యాయం చేసిన వేద విద్యార్థుల కు నెలకు సంభావన కింద నెలకు 3000 రూపాయలు చొప్పున దాదాపు 600 మందికి మూడు సంవత్సరాలు పాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. వేదం పవిత్రమైందని వేదాన్ని రక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
దేవాలయంలో ఉదయాన్నే ముఖ్యద్వారాలు తెరిచినప్పటి నుంచి రెండు గంటలపాటు ఓంకార నాదాలు వినపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అని మంత్రి ఆనం తెలిపారు. ప్రతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు, సేవలు, పూజ కైంకర్యాలు ఆగమపండితుల సూచనలు మేరకే జరిగే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని అనేక ఆలయాలను పునర్ నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సుమారుగా 5523 దేవాలయాలలో ధూప దీప నైవేద్యాల నిమిత్తం నెలకు పదివేల రూపాయలు కేటాయించడం జరిగిందని, అక్టోబర్ నవంబర్ నెలలో మరో వెయ్యి దేవాలయాలకు ఈ పథకం విస్తరించడం జరుగుతుందన్నారు.
నెల్లూరు నుండి తూర్పుగోదావరి వరకు ఉన్న దేవాలయాలలో 33% ఆలయం నుండి 61 శాతం దేవాదాయ శాఖ నుండి ప్రభుత్వం చెల్లిస్తుందని తద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆంధ్రాలో మూడు జిల్లాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలలో 20% దేవాలయ నిధులు 80 శాతం ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు.
ఏజెన్సీ మరియు ట్రైబల్ ఏరియా ప్రాంతాలలో 10 శాతం దేవాలయ నిధులు 90 శాతం ప్రభుత్వ నిధులతో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి 100% నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం యొక్క ప్రాసత్యాన్ని తెలిపే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
210 దేవాలయాల్లో సీజీఫ్ నిధులతో అభివృద్ధి పనులను సుమారుగా 232.75 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. అందులో 30% దేవాలయాలు మరియు భక్తుల నుండి వచ్చిందేనని ఆయన తెలిపారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరములలో ఆలయాల నిర్మాణ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఐదు లక్షల ఆదాయం ఉన్న గుడిలో సుమారుగా 1153 ఉన్నాయని అందులో 926 దేవాలయాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేసే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, కాల పరిమితి ఇంకా ఉన్న వారిని ఉంచడం జరిగిందని తెలిపారు.
25 లక్షల నుండి ఒక కోటి రూపాయలు ఆదాయం ఉన్న దేవాలయాలు 218 ఉన్నాయన్నారు. అందులో 167 దేవాలయాలకు పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని 67 దేవాలయాలకు పాలకమండళ్లు నియమించడం జరిగిందన్నారు.
కోటి రూపాయల నుండి ఐదు కోట్ల ఆదాయం ఉన్న దేవాలయాలు 75 ఉన్నాయన్నారు.58 దేవాలయాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, అలాగే 22 దేవాలయాలకు పాలకమండలి నియమించడం జరిగిందన్నారు. డిసెంబర్ మార్చి నాటికి అన్ని దేవాలయాల్లో పూర్తి స్థాయి లో పాలక మండలి ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి ఆనం తెలిపారు.