- 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం
🔴 నెల్లూరు : ది డెస్క్ :

పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
గురువారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఆయా మండలాల కన్వీనర్లతో కలిసి మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు.

ఎన్డీఎ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులుపడకూడదనే ఉద్దేశంతోనే 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 2024 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు 4.20 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందించి, ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచినట్లు చెప్పారు.
ఆత్మకూరులో వున్న 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా 250 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు మంచి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు రూ.12.80కోట్లు నిధులు మంజూరు.. పవన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి. రాష్ట్రంలో గ్రామపంచాయతీ బలోపేతంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టించారని మంత్రి ఆనం చెప్పారు. జిల్లాలోని 40 గ్రామపంచాయతీలకు నూతన భవనాలను డిప్యూటీ సీఎం మంజూరు చేసినట్లు చెప్పారు.
ఒక్కొక్క గ్రామపంచాయతీ భవనానికి రూ. 32 లక్షల చొప్పున జిల్లాలో సొంత భవనాలు లేని గ్రామపంచాయతీలకు 12.80కోట్లు నిధులను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మంజూరు చేయడం పట్ల మంత్రి ఆనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 50కోట్లను కూడా డిప్యూటీ సీఎం మంజూరు చేసినట్లు మంత్రి ఆనం చెప్పారు.