ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లా నుండి వేరు చేయబడి ఏలూరు జిల్లాలో కలిపిన ముదినేపల్లి మండలాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో కలపాలని విన్నవిస్తూ ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మనోజ్ కుమార్తె , అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గడిచిన ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ముదినేపల్లి మండల వాసులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.
జిల్లాల ఏర్పాటులో నైసర్గిక భౌగోళిక స్వరూపాలను పరిగణనలోనికి తీసుకోకుండా కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలంను ఏలూరు జిల్లాలోనికి ఎమ్.పి. నియోజకవర్గ ప్రాతిపదికన మార్చారన్నారు. దీంతో మండల ప్రజలు పలు విధములైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముదినేపల్లి మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపడంతో నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లడానికి సరైన బస్సు సౌకర్యం గాని మరే ఇతర రవాణా మార్గాలు లేక కైకలూరు మీదుగా గాని.. గుడివాడ మీదుగా వెళ్ళవలసిన దుస్థితి మండల ప్రజలు ఏర్పడిందన్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికి వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.
ఈ సమస్యలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ముదినేపల్లి మండలాన్ని జిల్లాల పునర్విభజనకు ముందువలేనే కృష్ణాజిల్లాలో కొనసాగించాలని మండల ప్రజల తరఫున కోరుతున్నానని అమ్ములు వైష్ణవి లేఖలో పేర్కొన్నారు.