The Desk … Mudinepalli : వడాలి శ్రీ పూరి జగన్నాథ్ స్వామి దేవస్థానంలో…

The Desk … Mudinepalli : వడాలి శ్రీ పూరి జగన్నాథ్ స్వామి దేవస్థానంలో…

  • అమరావతికి జీవం పోద్దాం – 116 సహాయం చేద్దాం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : వడాలి : ది డెస్క్ :

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పిలుపుమేరకు..ఆమె తండ్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోని పూరి జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు “రాష్ట్ర రాజధాని అమరావతికి జీవం పోద్దాం – 116 సహాయం చేద్దాం” కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల స్వీకరణ చేపట్టగా, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్వయంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.116 విరాళం అందజేశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“రాష్ట్ర రాజధాని అమరావతి ప్రతి ఆంధ్రుడి హృదయానికి ప్రతీక. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలనే ఉద్దేశంతో కేవలం రూ.116 రూపాయల సహాయం చేసే ఆలోచన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవికి రావడం నిజంగా అభినందనీయంమని, యువత ఈ విధంగా ముందుకు రావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభ సూచకం” అని అన్నారు.

కార్యక్రమంలో దేవస్థానం ఈవో సింగనపల్లి శ్రీనివాస్, గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు కూడా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రూ.116 చొప్పున విరాళాలు అందజేస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకారం ప్రకటించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ అంబుల మనోజ్ ప్రత్యేకంగా విరాళం అందించిన దాతల పాదాలను కడిగి పాదాభిషేకం నిర్వహించి ఘనంగా సన్మానించడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యం భక్తి, సేవా భావం, ప్రజా భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొని అమరావతి రాజధాని అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు. “అమరావతి మన రాజధాని – మన బాధ్యత” అనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.