ఏలూరు జిల్లా : ముదినేపల్లి క్రైమ్ : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై కైకలూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ ఆధ్వర్యంలో, ముదినేపల్లి ఎస్సై వీరభద్ర రావు కి రాబడిన సమాచారం పై తన సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. దాడిలో ప్రముఖ కంపెనీలకు చెందినట్లుగా.. నకిలీ గా తయారు చేసిన ఇంజిన్ ఆయిల్ భారీ సంఖ్యలో ఇంజిన్ ఆయిల్ బాటిళ్లు, లేబుళ్లు, సీలు, ప్యాకింగ్ సామగ్రి తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ ద్వారా వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వాహనాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉన్నందున, ఈ రకమైన అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న నకిలీ ఇంజిన్ ఆయిల్, ఇతర సామగ్రిని బుధవారం ముదినేపల్లి ఎస్సై వీరభద్ర రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ సమక్షంలో పరిశీలనకు ప్రవేశపెట్టారు.

ప్రముఖ కంపెనీలైన క్యాస్ట్రాల్, సర్వో ఇంజన్ ఆయిల్ అర లీటర్ బాటిల్ నుంచి 25 లీ వరకు స్వాధీనం చేసుకున్నామని, మోటార్ సైకిళ్లు కార్లు లారీలు జెసిబి లు కి ఉపయోగించే ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. లేటెస్ట్ గా ఉన్నటువంటి బి 6 వాహనాలకు ఉపయోగించే ఆయిల్ ను కూడా తయారు చేస్తున్నారని.. వ్యవసాయానికి ఉపయోగించే యూరియాను కూడా తయారు చేసేటటువంటి సామాగ్రిని కలిగి ఉన్నటువంటి విషయాన్ని ఏలూరు డిఎస్పీ తెలియచేసారు.

నకిలీ వస్తువుల తయారీ, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రజలు నకిలీ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సదరు విషయము పై ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గా ఏలూరు డి.ఎస్.పి. డి శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా తెలియచేశారు.

