ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
ఆమె ఓ వైద్య విద్యార్థిని… రెక్కలు విప్పుకొన్న పక్షిలా ఎగిరిపోవాలని కలలు కనే వయసు తనది. తన ఈడువాళ్లంతా సరదాలు, సంతోషాల కోసం డబ్బులు ఖర్చుపెడుతుంటే… ఈ అమ్మాయి మాత్రం దాచుకున్న డబ్బుల్నీ, భవిష్యత్తు కోసమని ఉంచిన ఆస్తుల్నీ… ప్రజా సేవ కోసం వినియోగిస్తోంది.
తాజాగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకోసం రూ. లక్ష విరాళం అందించి అందరితోనూ ఔరా అనిపించుకుంటోన్న అంబుల వైష్ణవి స్ఫూర్తి ప్రయాణమిది…
మాది ఏలూరు జిల్లా ముదినేపల్లి. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. నాన్న వైద్యుడిగా ఎంత బిజీగా ఉన్నా… నాకే లోటూ రాకుండా చూసుకునేవారు. మరో పక్క అర్ధరాత్రి వరకూ కూడా వైద్యం కోసం వచ్చేవారికి అందుబాటులో ఉండేవారు. అది చూసి ఎప్పుడైనా.. ‘నాన్నా ఎందుకింత శ్రమ’ అని అడిగితే… కష్టంలో ఉన్నప్పుడు స్పందిస్తేనే మనలో మానవత్వం మిగిలి ఉన్నట్లు అని చెప్పేవారు.
అలా ఆయన నుంచి అందుకున్న స్ఫూర్తితోనే చిన్నప్పటి నుంచీ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేదాన్ని. ఏడో తరగతి చదువుతున్న సమయంలో నాన్న ఇచ్చిన పాకెట్మనీతో మొదటిసారి రంగాపురం, ముదినేపల్లి పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నా. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫర్నిచర్, ఆటవస్తువులు, బోర్లు, నీటి ట్యాంకు వంటివి ఏర్పాటు చేశా.
ఆపై ‘‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన సుజలాం.. సుఫలాం.., వనం.. మనం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇంకుడు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటివే కాదు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారి చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసానీ నాన్న సాయంతో చేయగలిగా. నిరుపేదల అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వడమే కాదు… కొందరికి నాన్నతో తలకొరివీ పెట్టించి, నేను కర్మకాండల్ని చేశా.
కొవిడ్ బాధితులకు చేయూత…
చాలామంది ఈ చిన్న వయసులో ఇవన్నీ నీకెందుకమ్మా అంటుంటారు. సాయం చేయాలనే మనసుండాలి కానీ, సేవ చేయడానికి వయసుతో సంబంధం ఏముంది? నా వంతు చేయగలిగినవే చేస్తున్నా. నేను చేయాలనుకు వాటికి నాన్న తోడుంటున్నారు.
ఆ మధ్య కొవిడ్ రూపంలో మనందరికీ ఊహించని కష్టం వచ్చిపడిం ఆ సమయంలో పనులు లేక ఇబ్బందిపడుతోన్న సుమారు 400 మందికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరకులను అందించాం. అప్పుడు వారి కళ్లల్లో సంతోషం చూసి మాగుండె ఉప్పొంగిపోయింది.
నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డాక… రాష్ట్ర అభివృద్ధికోసం కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, అమరావతి స్థూపం, హైకోర్టు, పోలవరం నిర్మాణాలకు రూ. లక్ష చొప్పున అందించా. ఇది తెలిసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జనవరిలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తుకోసం నాపేరున ఉన్న మూడెకరాల్లో ఒకదాన్ని అమ్మగా వచ్చిన మొత్తం ఇస్తానన్నా.
ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆ రూ.25 లక్షలను, పోలవర ప్రాజెక్టుకోసం నా బంగారం అమ్మగా వచ్చిన రూ. లక్ష రూపాయల్ని తాజాగా ముఖ్యమంత్రికి అందించా.
ఆయన మరోసారి అమరావతి అంబాసిడర్గా నన్ను ప్రకటించారు. దీన్ని బాధ్యతగా తీసుకుని భవిష్యత్తులో సామాజిక ప్రయోజనం ఉన్న పనులు మరిన్ని చేస్తా. ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా.