ఏలూరు జిల్లా : ముదినేపల్లి :
వైద్యో నారాయణో హరి అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ అంబుల మనోజ్. తండ్రి వలెనే కుమార్తె వైద్య విద్యార్థిని వైష్ణవి కూడా. దీనజనుల సేవే లక్ష్యంగా గత 32 సంవత్సరాలుగా వైద్యవృత్తిలో రాణిస్తున్నారు మనోజ్. తండ్రి కలలకు ప్రతిరూపంగా నిలిచిన తనయ వైష్ణవి. తమ సేవాదృక్పథంతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకూ రూ.50 లక్షల వరకూ వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు, విరాళాల రూపంలో అందజేశారు. కోవిడ్ కష్ట సమయంలో పేదల ఆకలిని తీర్చడానిక తమవంతుగా ఆహార పొట్లాలు, మందుల కిట్లను పంపిణీచేశారు.
ఏలూరు జిల్లా.. ముదినేపల్లికి చెందిన డాక్టర్ అంబుల మనోజ్ ఆ పరిసర ప్రాంతాల్లో ‘ఆపద్బాంధవుడు’గా పేరుగాంచారు. పల్లె వైద్యుడిగా నిరుపేదలకు తన శక్తిమేరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాక, అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వారికి రూ.5000 ఆర్థిక సహాయం, రూ.2000 విలువైన నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కరోనా సమయంలో అనాథ భౌతిక కాయాలకు దహన సంస్కారాలు జరిగేలా ఏర్పాటుచేశారు. క్యాన్సర్, టీవీ పేషెంట్లకు ఆర్థిక సాయం అందించారు. పేదల భౌతిక కాయాల దహనం నిమిత్తం నిరంతరం రూ.5000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.
రెండు పాఠశాలలు, ఒక కళాశాల దత్తత..
పెయ్యేరు పంచాయతీ శివారు రంగాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ముదినేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను దత్తత తీసుకుని రూ.10 లక్షలతో ఆధునీకరించారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. సరికొత్తగా రంగులు వేయించి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఆవరణలో మొక్కలు నాటించారు. వాటి రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయించారు. 12 బెంచీలు, 12 డెస్క్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌కు ప్రొజెక్టర్‌ను కూడా సమకూర్చారు. మంచినీటి బోరు, ఇంకుడు గుంత నిర్మాణం, వంటశాల నిర్మాణాలు చేపట్టారు. సరిపడా ఆట వస్తువులు సమకూర్చారు. ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు మంచినీటి బోర్లు వేయించారు. మంచి నీటి ట్యాంక్ నిర్మించారు. 50 మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయించారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించారు. రెండు ఇంకుడు గుంతలను కూడా నిర్మించారు. ముదినేపల్లి జూనియర్ కళాశాలను దత్తత తీసుకుని కాంపౌండ్ వాల్‌కు రంగులు వేయించారు. రెండు మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటించారు. జాతీయ నాయకుల నినాదాలను గోడలపై రాయించారు. అప్పటి కలెక్టర్ లక్ష్మీకాంతం స్ఫూర్తితో 400 మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటుచేయించారు.
పర్యావరణం – పరిశుభ్రతపై అవగాహన..
పర్యావరణ పరిరక్షణ కోసం ‘చెట్లు పెంచాలి-అడవులను కాపాడాలి, ‘మొక్కలను పెంచండి-ప్రకృతిని కాపాడండి’ అనే నినాదాలతో కైకలూరు, గుడివాడ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటుగా పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తుచేస్తూ పలు మండలాల్లో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. స్వచ్ఛభారత్‌పైనా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ‘సుజలాం- సుఫలం, వనం-మనం’ కార్యక్రమాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సొంత ఖర్చులతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు.
నిరుపేదలకు ఆర్థిక సాయం..
ఇలాంటి సేవాదృక్పథం డాక్టర్ మనోజ్ దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవిది. తను కూడా తండ్రి వలె మొదటి నుంచీ సేవాదృక్పథంతో వైద్యవిద్య పట్ల ఆసక్తిని పెంచుకొంది. మన అమరావతి అభివృద్ధికి తన పాకెట్ మనీ రూ.లక్ష విరాళంగా అందించారు. అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. అమరావతి అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ‘మన పాకెట్ మనీతో పాఠశాలలను తీర్చిదిద్దుకుందాం’ అనే నినాదంతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి స్తూపం, హైకోర్టు నిర్మాణానికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షలు, పోలవరం నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. మొత్తంగా రాజధాని ప్రాజెక్టుల నిమిత్తం రూ.10 లక్షలు ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు. తండ్రి తనకోసం డిపాజిట్ చేసిన రూ.లక్షను నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి విరాళంగా అందించారు. ఐదో తరగతిలోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 40 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి అభినందనలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లో మొదటిసారి, 2024లో రెండోసారి అంబుల వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
పొలం అమ్మి… అమరావతి రాజధానికి విరాళం..
అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ రూ.35 లక్షలు ఇచ్చారు. తమకున్న మూడు ఎకరాల పొలంలో ఒక ఎకరం, తనకున్న బంగారు గాజులు అమ్మి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా చెక్కు రూపంలో అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్ సేవా సంస్థ కామధేను అవార్డును 2024లో అందించింది. తండ్రి బాటలోనే సేవాతత్పరత కొనసాగిస్తున్న వైష్ణవి ఇప్పుడు వైద్యవిద్యార్థిని. త్వరలో వైద్యపట్టా అందుకొని తన సేవలను విస్తృతపరుస్తానని ఆమె అంటున్నారు.
నాన్న మాటలే స్ఫూర్తి : అంబుల వైష్ణవి, వైద్య విద్యార్థిని
నా తండ్రి ప్రయివేటు ప్రాక్టీషనర్‌గా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదాల్లో ఎవరైనా చనిపోయినా, గాయపడినా అడక్కుండానే ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఆయన స్ఫూర్తితోనే ఐదో తరగతి నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇప్పటివరకూ రూ.20 లక్షలు వరకూ పేదలకు ఆర్థిక సహాయం చేశా. నాన్న సుమారు రూ.30 లక్షల వరకూ చేశారు. డాక్టరయ్యాక మరింత వైద్య సేవలు అందిస్తా.