ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK NEWS :
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, విపత్తుల నిర్వహణ) ఆర్ పి సిసోడియా శుక్రవారం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు రానున్నారు.
గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్ధానం (శివాలయం) అవరణలో నిర్వహించే రెవిన్యూ సదస్సులో సిసోడియా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. సిసోడియా రాకను పురస్కరించుకుని ఏలూరు ఆర్డిఓ అంబరీష్, ముదినేపల్లి తాహసీల్దార్ సుబానీ, గుడివాడ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ చళ్ళగుళ్ల శోభనాధ్రి చౌదరి తదితరులు గురువారం గ్రామంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా శోభనాద్రి చౌదరి మాట్లాడుతూ.. సిసోడియా రాకతో రెవిన్యూ రికార్డుల పరంగా గ్రామం ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. గ్రామంలోని కొన్ని నివాస గృహాల ప్రాంతాన్ని చుక్కల భూమిగా నమోదు చేసారని, దీనివల్ల రిజిస్ట్రేషన్లు కాక క్రయవిక్రయాలకు ఇబ్బంది నెలకొందని వివరించారు.