కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
రానున్న తుఫాను కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
బుధవారం ఉదయం మంత్రివర్యులు మొవ్వ మండలం కారకంబాడు గ్రామ పర్యటన సందర్భంగా మార్గమధ్యలో పామర్రు సెంటరు నుండి గుడివాడ వెళ్లే రహదారిలో రైతులు ఒకవైపు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. దాన్యం కొనుగోలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలులో తాము ఇబ్బందులు పడుతున్నామని, రైతులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేకాకుండా రంగు మారిన దాన్యం మిల్లర్లు తీసుకోవడం లేదని, ఆ ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా తగిన సహాయం చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రివర్యులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో సెల్ఫోన్లో మాట్లాడుతూ.. రానున్న తుఫాను వలన రైతులకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
రైతులకు ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇక్కడ రైతులంతా రహదారి వెంబడి ధాన్యం ఆరబోసుకుని ఉన్నారని, వెంటనే ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేసి వచ్చే 4 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
పామర్రు నియోజకవర్గానికి సంబంధించి మిల్లర్లు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అధికారులందరినీ సమన్వయపరిచి రైతుల ఇబ్బందులను తొలగించే విధంగా చొరవ చూపాలన్నారు.

