The Desk…Machilipatnam : రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం :  జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం విరాజిల్లుతూ ఉందని, పటిష్టమైన మన రాజ్యాంగాన్ని తయారు చేసిన మహనీయులందరినీ స్మరించుకోవడం మన కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.

బుధవారం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ తో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలోజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26 వ తేదీన మన రాజ్యాంగాన్ని స్వీకరించినప్పటికీ 1950 సంవత్సరం జనవరి 26 వ తేదీన సర్వసత్తాక సంపూర్ణ రాజ్యాంగ మన దేశం అవతరించి రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు.

మనకు స్వాతంత్రం లభించినప్పుడు ప్రపంచంలోని రాజకీయ నాయకులు మన దేశం 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యం పడిపోతుందని అనుకున్నారన్నారు. నిజానికి దేశంలో అక్షరాస్యత లేకున్నా పటిష్టమైన రాజ్యాంగం వలన నిలబడిందన్నారు

స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు దాటినప్పటికీ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందరికీ సమానత్వం, సామ్యవాదం, సౌబ్రాతృత్వం తదితర అంశాలతో ఉండాలని, భవిష్యత్తులో ఎదురయ్యే స పరిస్థితులను మస్యలను ముందుగానే లోతుగా ఆలోచించి, చర్చలు జరిపి ఎన్నో జాగ్రత్తలతో భారత రాజ్యాంగాన్ని బలిష్టంగా రూపొందించారన్నారు.

మనతోపాటు స్వాతంత్రం పొందిన పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం నిలబడలేదన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ఒక పెద్దపటిష్టమైన విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.

ప్రజాస్వామ్యంలో పౌరులే ప్రభువులని స్పష్టం చేస్తూ
రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లాడి కృష్ణ స్వామి అయ్యంగార్, బి.ఎన్.రావు వంటి మహనీయులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాజ్యాంగం లోని మన ప్రాథమిక హక్కులు విధులు తదితర కనీస విషయాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ఆ దిశగా దృష్టి సారించాలన్నారు.
జీవితం చాలా పెద్దదని పాఠ్యపుస్తకాలు బాగా చదివితే జీవితంలో విజయం సాధించవచ్చనీ విద్యార్థులకు ఉద్బోధించారు. పోటీ పరీక్షల్లో బాగా రాణించాలంటే విషయం పైన పట్టు ఉండాలని, తెలిసిన వ్యక్తుల గురించి సొంతంగా తెలుగులో గాని ఆంగ్లంలో గాని బాగా వ్యాసం రాయగలగడం, ప్రసంగించడం ఏ రంగంలో అయినా చాలా అవసరం అన్నారు.

అనంతరం గత 20 రోజులుగా పాఠశాల, మండల, జిల్లా స్థాయిలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రము, పతకాన్ని అందజేశారు.
అలాగే విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ప్రశంసా పత్రాలతో కలెక్టర్ సత్కరించారు.

కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి జిల్లా విద్యాధికారి పివిజె రామారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, జిల్లా సైన్స్ అధికారి జాకీర్ కలెక్టరేట్ ఏవో రాధిక, కలెక్టరేట్ సిబ్బంది, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.