కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే రాయచోటిలో 3,00,192 గృహ గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని చింతగుంటపాలెంలో పి ఎం ఏ వై అర్బన్ 1.0 పథకం కింద కుప్పా శ్రీనివాసరావు, సిద్ధినేని యానాది రావు నిర్మించుకున్న గృహాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం కటకం లక్ష్మీనారాయణ ఫణి కుమారీలకు చెందిన పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఆర్టీసీ చైర్మన్ పూజలు నిర్వహించి లబ్ధిదారులను అభినందించారు.
అనంతరం దేశాయిపేటలో ఉన్న శ్రీ విన్నకోట వెంకటస్వామి నాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సభా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 6,708 గృహాలు పూర్తయ్యాయన్నారు.
అందులో మచిలీపట్నంలో నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయన్నారు.
ఇల్లు అనేది ప్రతి ఒక్క పౌరుడి కల అని సొంత ఇల్లు ఉంటే అద్దె ఖర్చులు ఆదా అవుతాయని, ఏ పనైనా చేసుకోవచ్చని భరోసా ఉంటుందన్నారు. చాలామంది లబ్ధిదారులు వారికి మంజూరైన ఇల్లు పూర్తి చేసుకున్నారన్నారు.
ఇంకా కొంతమంది ఇల్లు మంజూరు కానీ కొత్త వారికి పిఎంఏ వై 2.0 పథకం కింద ఈ నెలాఖరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ పథకంలో గృహ నిర్మాణానికి 2. 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదివరకే ఇల్లు మంజూరు చేసి ఇంకా ఇల్లు పూర్తి చేయనివారు వచ్చే మార్చి 31వ తేదీ లోగా ఇళ్లను పూర్తి చేసుకోవాలని, లేకుంటే వారికి ఇంటి బిల్లు చెల్లింపులు జరగకుండా పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
తొందరగా ఇల్లు నిర్మించుకుంటే త్వరగా వారికి దశలవారి పైకం చెల్లించబడుతుందన్నారు.
అంతేకాకుండా సిమెంటు, స్టీలు తదితర సామాగ్రి ధరలు ఆలస్యం చేసే కొద్దీ పెరుగుతాయని చెప్పారు.
ఇంకా అదనంగా డబ్బు కావాలంటే కూడా వెలుగు లేదా మెప్మా సంఘాల ద్వారా రుణాల సౌకర్యం కల్పించబడుతుందన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 192 ఇళ్లను ఈరోజు ప్రారంభించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. పేదవారికి కూడు గుడ్డ నీడ కల్పించాలన్నదే ఆయన కోరికన్నారు.
జిల్లాలో 6 వేల గృహాలను, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలను పూర్తి చేసుకొని నేడు గృహప్రవేశాలు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్న వాటిని అధిగమిస్తూ పేదవారికి ప్రాధాన్యతనిస్తూ పలు సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.
పిఎం ఏ వై 2.0 పథకం కింద 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ 2.50 రూపాయల మేరకు ఆర్థిక సహాయంతో లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేస్తుందన్నారు.
ప్రభుత్వం ఉచితంగా స్థలాలు కూడా ఇస్తోందని, గతంలో ఒక సెంటు స్థలం ఇవ్వడంతో పేద ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారని నేడు తమ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇస్తున్నామన్నారు
అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు.
గతంలో బస్సుల్లో 30 శాతం మంది మహిళలు ప్రయాణిస్తుండగా నేడు 70 శాతానికి పెరిగిందన్నారు.
మహిళలు ఉద్యోగాలకు, కూలి పనులకు, ఆసుపత్రులకు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తూ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తాను ఆర్టీసీ చైర్మన్గా ఉన్న సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని , అందులో భాగంగానే ఈనెల 13వ తేదీన విశాఖపట్నంలో సిఐఐ సమావేశం నిర్వహిస్తోందన్నారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తల నుండి విరివిగా పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలబడే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధిపతి పోతురాజు,ఈ ఈ. వెంకటరావు, రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్, మచిలీపట్నం అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

