కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఆదివారం నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంటి కృష్ణ యాదవ్ గృహంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..
మొంథా తుపాను సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో అధికారులందరినీ అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వం, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి తగిన చర్యలు తీసుకుందని మంత్రి గుర్తు చేశారు.
పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్యవసర సరుకులు అందించిందన్నారు. తుపాను సమయంలో ఉపాధి కోల్పోయిన తీర ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు ఒక్కొక్క కేజీ చొప్పున నిత్యావసర సరుకులు అందించిందని తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 46 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని, మొక్కజొన్న, అపరాలు, మామిడి ఇతర పంటలు దెబ్బతిన్నాయని వివరిస్తూ జరిగిన పంట నష్టానికి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ జరుగుతోందన్నారు. పంట నష్ట అంచన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తుపానుకు నష్టపోయిన ప్రతి రైతుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా హెక్టారుకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాల కంటే మిన్నగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, అధిక మొత్తంలో పింఛన్ల పెంపుదల, కౌలు రైతులకు పెద్ద మొత్తంలో సిసిఆర్సి కార్డుల మంజూరుతో పాటు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేసి అధిక ప్రయోజనం చేకూర్చిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారన్నారు. మొంథా తుపాను సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని విధాలుగా అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారని అభినందించారు.
సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

