కృష్ణాజిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
తుపాను కారణంగా ముంపుకు గురైన పంట పొలాలలోని నీరు బయటకు పోయేందుకు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఏఈ), వ్యవసాయ అధికారులతో(ఏఓ) టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా జిల్లాలో ముంపుకు గురైన పంట పొలాల్లోని నీరు బయటకు పోయేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇరిగేషన్ మురుగుకాలువల స్థితిగతులపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. ముంపుకు గురైన పంట పొలాల ప్రాంతాలను సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు తెలియపరచాలని, తద్వారా నీరు బయటకు పోయేందుకు వీలుగా సాగునీటి మురుగు కాలువల్లోని గుర్రపుడెక్క, తూడు తొలగింపుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లి నీలిపూడి మధ్య వెళ్లే డ్రైనేజీ గుర్రపు డెక్క, తూడుతో నిండిపోయిందని, దీనివల్ల ఆ ప్రాంత పరిధిలోని పంట పొలాలలోని నీరు సవ్యంగా బయటకి పోవడం లేదని ఏవో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా బంటుమిల్లి మండలం చోరంపూడి వద్ద డ్రైనేజీ తూములు పూడుకుపోయి నీరు పారడం లేదని, దీనివల్ల ములపర్రు, ఆముదాలపల్లి తదితర ప్రాంతాల పొలాలలోని నీరు తగ్గడం లేదని తెలిపారు.
కృష్ణానదికి వరద నీరు పెరగడం వల్ల నాగాయలంక, కోడూరు మండలాల్లో మురుగు కాలువలు పొంగి ఉన్నాయని దీనివల్ల పొలాల్లోని నీరు ముందుకు సాగడం లేదని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఏఓలు, ఏఈలు పంట పొలాలలోని నీరు బయటకు పంపటం అత్యధిక ప్రాధాన్యతాంశంగా భావించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

