The Desk…Machilipatnam : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రభుత్వ వసతి గృహాల్లోనీ విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా జిల్లాలోని 90 ప్రభుత్వ వసతి గృహాల్లో మంచినీటి ఉపరితల జలాశయాలను నెలకోసారి పరిశుభ్రం చేయాలన్నారు. ఇందుకోసం ఒక రిజిస్టర్ను నిర్వహించి స్థానిక ప్రజల సంతకాలు తీసుకోవాలన్నారు.

అన్ని వసతి గృహాలను ఒకసారి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం సంబంధిత మునిసిపాలిటీ, పంచాయతీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల చుట్టుపక్కల చెత్తాచెదారాలను తొలగించాలన్నారు. అన్ని వసతి గృహాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒక యాప్ ను సిద్ధం చేసి ఈ పనులన్నిటిని అందులో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు.

మంచినీటి పరీక్షల పరికరాలను పరీక్షించే పరికరాలను సరఫరా చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్ తో సంప్రదించి వాటిని కొనుగోలు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వసతి గృహంలో క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల సంక్షేమ అధికారులకు నీరు, ఆహార నాణ్యతల పరీక్షలపైన శిక్షణ తరగతులు నిర్వహించి సరైన అవగాహన కలిగించాలన్నారు.

వైద్యాధికారులు, ఏఎన్ఎం లు ప్రతి నెల 3 వ గురువారం వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల వంట వాళ్లతో పాటుగా మధ్యాహ్నం భోజనం వండే వంటవాళ్లకు కూడా హైజనిక్ స్థితులలో ఎలా వంట వండాలి, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు.

మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేసి చేపట్టవలసిన పనులు అన్నీ జరిగాయా లేదా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా అక్కడి నీటి నమూనాలను సేకరించి పరీక్షించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నీటిని తెప్పించి నీటి పరీక్ష పరికరాలు ఎలా పనిచేస్తాయో స్వయంగా పరిశీలించారు.

సమావేశంలో జిల్లా ఎస్.సి. సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జడ్పీ సీఈవో కే. కన్నమ నాయుడు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, డిఎంహెచ్వో డాక్టర్ ఏ వెంకట్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, ఎన్ ఐ సి డి ఐ ఓ ఫణి కృష్ణ, ఎం ఐ హెచ్ పి ప్రాజెక్ట్ ఇంచార్జి డాక్టర్ సాయి కిరణ్, ఆహార భద్రత అధికారి గోపాలకృష్ణ, రుద్రవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సింగరాయ, మైనార్టీస్ అధికారి బి రవి, వైద్యులు పాల్గొన్నారు.