కృష్ణ జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై జిల్లాలో ప్రచార కార్యక్రమాలు విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ 2.0) సంస్కరణల ఫలాలను ప్రజలందరూ పొందే విధంగా చూడాలని, గతంలోని ధరలకు జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ధరలను ప్రజలకు వివరించి అవగాహన కలిగించాలని సూచించారు.
కిరాణా సామాగ్రి, ఆరోగ్యం జీవిత బీమా, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్, రవాణ, వ్యవసాయ పరికరాలు, రోజువారీ నిత్యవసరాలు తదితర వస్తువులు తగ్గించిన జిఎస్టి ధరలతో తక్కువ ధరకే పొందవచ్చన్న విషయాన్ని ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా వివరించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్ లో ప్రకటించిన విధంగా ట్రాక్టర్, ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. చేపట్టిన కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు చెప్పారు.