కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
దేశంలోనే ఆదర్శవంతమైన కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా నిలిపేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు మందిరములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కృష్ణా జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ కార్యకర్త డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ ను జిల్లా కమిటీ చైర్మన్ గా, సిర్విశెట్టి భాస్కర్ ను వైస్ చైర్మన్ గా నియమించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎలాంటి స్వార్థం లేకుండా సేవా దృక్పథంతో అంకితమైన సేవలను అందిస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. 1859లో యుద్ధంలో గాయపడిన సైనికుల పరిస్థితిని చూసి చలించిపోయిన స్విస్ వ్యాపారవేత్త జీన్ హెన్రీ డ్యూనంట్, మానవతా సేవకు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. 1901లో ఆ సంస్థకు తొలి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందన్న సంఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం దాదాపు 170 సంవత్సరాల చరిత్ర కలిగిన రెడ్ క్రాస్ సొసైటీ, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ తన సేవలను విస్తరించి అందిస్తోందని కొనియాడారు. భారతదేశంలో 1920వ సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ద్వారా సంస్థను ఏర్పాటు చేశారని, దీనికి జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతి, రాష్ట్రస్థాయిలో గవర్నర్, జిల్లాస్థాయిలో కలెక్టర్లు అధ్యక్షులుగా ఉంటారని అన్నారు.
విద్య, వైద్యం, జీవనోపాదులు కల్పన రంగాలలో కూడా రెడ్ క్రాస్ సంస్థ తన సేవలను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. సంస్థకు విరాళాలు అందించడంలో కూడా దాతలు వెనుకాడకుండా ముందుకు వస్తున్నారంటే అది కేవలం సంస్థకు ఉన్న విశ్వసనీయతని అన్నారు. కృష్ణాజిల్లా శాఖ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థను దేశంలోని ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ అబ్జర్వర్ రామచంద్ర రాజు ప్రసంగించి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, సంస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ ప్యాట్రన్, వైఎస్ ప్యాట్రన్, జీవిత సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.