The Desk…Machilipatnam : రాష్ట్రస్థాయిలో జిల్లాకు నాలుగు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : రాష్ట్రస్థాయిలో జిల్లాకు నాలుగు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్: ది డెస్క్ :

రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు పొందటం హర్షణీయమని, ఇది జిల్లాకు ఎంతో గర్వకారణం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 17 విభాగాలలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రకటించిందని తెలిపారు.

రాష్ట్రస్థాయిలో నాలుగు అవార్డులు పొందామని, ఆ వివరాలను ఆయన తెలియజేస్తూ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా చల్లపల్లి, స్వచ్ఛ రైతు బజారుగా మొవ్వ, స్వచ్ఛ హాస్టల్ గా దావాజీ గూడెంలోని ప్రభుత్వ బిసి హాస్టల్, స్వచ్ఛ ఇండస్ట్రీస్ గా కృష్ణా డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ అవార్డులు పొందాయని, వీరందరికీ కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అదేవిధంగా జిల్లాస్థాయిలో 44 అవార్డులు పొందామని వివరిస్తూ స్వచ్ఛ మున్సిపాలిటీగా తాడిగడప మునిసిపాలిటీ, స్వచ్ఛ అంగన్వాడీలుగా చల్లపల్లి, గుడివాడ మండలంలోని సత్యనారాయణపురం, ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా కలెక్టరేట్ లోని రెవెన్యూ కార్యాలయం, గుడివాడ మున్సిపల్ కార్యాలయం, పెనమలూరు ఎంపీడీవో కార్యాలయం అవార్డును సొంతం చేసుకున్నాయన్నారు. ఇదే రీతిలో స్వచ్ఛ ఇండస్ట్రీస్, పంచాయతీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, బస్ స్టేషన్ తదితరు విభాగాలలో అవార్డులు పొందినట్లు కలెక్టర్ తెలిపారు.

అవార్డులు పొందడంలో సంబంధిత అధికారులు, యాజమాన్యాలు ఎంతో కృషి చేశాయని వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అవార్డులు పొందిన వారి నుంచి స్ఫూర్తిని పొంది పరిశుభ్రత స్వచ్ఛ జిల్లాకు కృషి చేయాలని కోరారు.జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జే అరుణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి జడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.