- బందరుకోట, గిలకలదిండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : బందరుకోట/గిలకలదిండి : ది డెస్క్ :
గిలకలదిండి, బందరుకోట వంటి తీర ప్రాంతాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం మంత్రి 21వ డివిజన్, బందరుకోటలో శ్రీ కోదండ రామస్వామి, హనుమాన్ టెంపుల్ సమీపంలో రూ.30 లక్షల విలువైన మూడు సీసీ రోడ్ల పనులు, అదేవిధంగా 20వ డివిజన్, గిలకలదిండిలో రూ.10 లక్షల వ్యయంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బందరుకోటలో దాదాపు రూ.30 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. శ్రీ కోదండ రామస్వామి, హనుమాన్ టెంపుల్ కు వెళ్లే దారికి సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని, దీని ద్వారా వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
త్వరలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, రహదారుల విస్తరణకు కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గిలకలదిండిలో 2014–19 కాలంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించామని, అయితే సంబంధిత పనులు మొత్తం పూర్తయినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. గత నెలలో వాటర్ ట్యాంక్ కు దాదాపు రూ.20 లక్షలు వెచ్చించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు పుష్కలంగా నీటిని అందిస్తున్నామన్నారు.
అయితే ట్యాంకుకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు రూ. పది లక్షల వ్యయంతో ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, త్వరలో అది పూర్తి చేసి దానిని పరిరక్షించేందుకు నైట్ వాచ్మెన్ ను ఏర్పాటు చేసి నీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పుష్కలంగా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదే రీతిలో బందరు కోటలో కూడా మరో ట్యాంకును నిర్మించేందుకు కార్యచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమాలలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ లంకె నారాయణ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, బందరుకోట, గిలకలదిండి ఇన్చార్జిలు బచ్చు అనీల్, రమేష్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ లోగిసెట్టి వెంకట స్వామి, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, గుమ్మడి విద్యాసాగర్, తలారి సోమశేఖర్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.