- జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ఇంటింటికి ప్రచారం చేయాలి
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా జీఎస్టీ సంస్కరణలు, ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్, పీఎం సూర్యఘర్ ప్రగతి, అన్న క్యాంటీన్ల నిర్వహణ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలపై సానుకూల ప్రజా దృక్పథం, పారిశుద్ధ్యం నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతిఒక్కరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో, వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రచార కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్న అంశాలను పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రజలకు తెలిసేలా ప్రకటనలు జారీ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు.
వివిధ ప్రసార మాధ్యమాలతో పాటు కళాకారులను వినియోగించి జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని, అందుకు కలంకారి, జ్యూవెలరీ, క్లాత్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ తదితర ట్రేడ్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఏఎస్పీ వీవీ నాయుడు, కమర్షియల్ టాక్స్ అడిషనల్ కమిషనర్ బాలాజీ బాబు, జాయింట్ కమిషనర్ కల్పన, మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ మనోహర్ రావు, బి రమ్య తదితరులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.