The Desk… Machilipatnam : హైవేలపై ద్విచక్ర వాహనదారలు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk… Machilipatnam : హైవేలపై ద్విచక్ర వాహనదారలు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS :

హైవేలపై ప్రయాణించే ద్విచక్ర వాహన చోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ సమీక్షించింది.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులు కలెక్టర్ సమీక్షిస్తూ సకాలంలో కేసు వివరాలు సంబంధిత సైట్ లో నమోదు చేయడం ద్వారా క్షతగాత్రులకు బాధితులకు భీమా అందేలా చూడాలన్నారు, నేరాలు దోపిడీలు వంటివి జరగకుండా హైవేలపై సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

జాతీయ రహదారి 65 గురజాడ క్రాసింగ్ అండర్ పాస్ వద్ద లైటింగ్, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న సిగ్నల్స్ అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, పరాస్ పేట, బుట్టాయిపేట, జవారిపేట, నాగపోతరావు సెంటర్ వంటి ప్రాంతాల్లో సిగ్నల్స్ లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయాలన్నారు.

రోడ్లపై పశువుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలకు ఆస్కారం కలుగుతున్నదని, ఈ సమస్య పరిష్కారానికి పశువుల కొమ్ములకు రేడియం పెయింట్ లేదా స్టిక్కర్ లేదా బెల్ట్ ఏది ఉత్తమమో ఆలోచించి చర్యలు తీసుకోవాలన్నారు. గో సంరక్షణ సంఘాలతో మీటింగ్ పెట్టి పశువులను రోడ్లపై వదలకుండా పశు పోషకులలో అవగాహన కల్పించాలన్నారు. నగరంలో ఆటోల రద్దీ నియంత్రణకు నిర్దేశించిన ఆటోస్టాండ్స్ వినియోగించేలా చూడాలన్నారు.

నగరంలో ఫ్లెక్సీలు సమస్య నివారణకు ప్రతిరోజు రాత్రుళ్ళు తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన రహదారుల్లో షాపులు వ్యాపార సంస్థల ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి రాత్రుళ్ళు చెత్త సేకరణ ప్రారంభించాలన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, అవగాహన రహిత్యంతో ప్రమాదాలు బారిన పడకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని, ముఖ్యంగా హైవేలపై టూ వీలర్స్ వారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, హెల్మెట్ లేనివారు వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాలలు, కళాశాలల ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయా శాఖలు తీసుకున్న చర్యానివేదిక తొలుత రవాణా అధికారులు కలెక్టర్కు సమర్పించారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, జిల్లా రవాణా శాఖ అధికారి బి ఎస్ ఎస్ నాయక్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, ట్రాఫిక్ సిఐ శివకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి వాణిశ్రీ, జాతీయ రహదారుల సంస్థ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్ లత, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.