కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతులలో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి యూరియా సరఫరా పై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ విషయమై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో నమ్మకాన్ని పెంపొందించాలన్నారుమన గ్రోమోర్ కేంద్రాల నుండి వీలైనంతవరకు యూరియాను గ్రామాలకు తీసుకొని వెళ్లి అక్కడి రైతులకు పంపిణీ సాఫీగా చేయాలని ఆదేశించారు.యూరియా ఒకే చోట ఎక్కువగా పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ ఒకే చోట ఇవ్వడం వలన పెద్దగా రైతులందరూ గుమికూడి బారులుగా ఉంటున్నారని, అలా కాకుండా గ్రామాలకు వెళ్లి రైతులకు సజావుగా పంపిణీ చేయాలన్నారు. ఐఎఫ్ఎంఎస్ లో యూరియా పొందిన రైతులకు వెంటనే బయోమెట్రిక్ వేయించాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రైతులను ఎక్కువసేపు క్యూలలో ఉండకుండా తగిన విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
శనివారం 1,300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు. సాధారణ రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియాను పంపిణీ చేయాలన్నారు. ఇందుకోసం సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు సమన్వయంతో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు యూరియా పై తాజా సమాచారాన్ని కోరుతున్న దృష్ట్యా, జిల్లాలో భౌతికంగా ఎంత మేరకు యూరియా నిల్వలు ఉన్నాయి అనే వివరాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో వెంటనే నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే యూరియా సరఫరాలో రైతులకు కలిగే ఇబ్బందులను తెలియజేస్తే వారి వద్ద ఉన్న సమాచారం సజావుగా తెలియజేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని రావాలన్నారు.
వార్తాపత్రికలలో యూరియా పై వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు వివరణలు జారీ చేయాలన్నారు.ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజరు మురళీ కిషోర్, తదితర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు