కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లాలోని ఘంటసాల మండలం పాప వినాశనం ఇసుక రీచ్ నుండి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ టెండర్లు పిలవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి.. ఇసుక నిల్వల స్థితిగతులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఇసుక రీచ్ లలో వచ్చే అక్టోబర్ నెల 15వ తేదీ వరకు ఎక్కడ కూడా తవ్వకాలు జరపకుండా నిషేధం విధించిందన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లాలో చోడవరం, మద్దూరు, నార్త్ వల్లూరు, పడమట లంక, రొయ్యూరు రెండు చోట్ల,శ్రీకాకుళం అనే 7 ఇసుక నిల్వ కేంద్రాలలో 6,50,801 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ప్రజలు ఎవరైనా సరే వారి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునేందుకు వీలు కల్పించాలన్నారు.
కొత్తగా ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలోని ఇసుక రీచ్ లో 1,54,500 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు గుర్తించామని, అన్ని రకాల అనుమతులు వచ్చినందున తవ్వకాలు జరిపే ఏజెన్సీల ఎంపిక కోసం ఈ- టెండర్లను ఈ ప్రోక్యుర్మెంట్ పోర్టల్ ద్వారా కోరాలన్నారు. సెమీ మేకనైజ్డ్ పద్ధతిలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ చార్జీలు, నిర్వహణ ఖర్చులు అన్నీ కలిపి కనిష్ట ధర 77 రూపాయలు, గరిష్ట ధర 85 రూపాయలకు లోబడి గతంలో మాదిరిగా నిర్ణయించడం జరిగిందన్నారు.
సమావేశంలో జిల్లా గనులు భూగర్భ వనరుల శాఖ అధికారి శ్రీనివాస కుమార్, మచిలీపట్నం, ఉయ్యూరు ఆర్డిఓలు స్వాతి, హేల షారోన్, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ నటరాజు, వాణిజ్య పన్ను ల సహాయ కమిషనర్ సౌమ్య,డిటిసి వెంకటేశ్వర్లు, ఏజీ కొండారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.