కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లాలోని వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై జరిగే సర్వే గురించి సంపూర్ణ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై కార్యశాల నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే డిపిఐఐటి అవుట్ రీచ్ సర్వే గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పి పి టి ద్వారా వివరించారు, అనంతరం జిల్లా ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి పరిశ్రమలకు పలు రాయితీలు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు అంతర్గత వ్యాపారాల ప్రోత్సాహక శాఖ ( డిపిఐఐటి )ద్వారా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక(బి ఆర్ ఏ పి) కింద పరిశ్రమలు నెలకొల్పిన వ్యాపారవేత్తలతో నేరుగా సర్వే చేస్తుందన్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ శాఖలు 2,150 సేవలు అందిస్తున్నాయన్నారు. అందులో ఇప్పటివరకు ఔట్రీచ్ పై సంబంధిత వినియోగదారులు 2,089 మందికి అవగాహన కలిగించారన్నారు. మిగిలిన వారిలో ముఖ్యంగా మచిలీపట్నం, పెడన, వైయస్సార్ తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వ్యాపారవేత్తలకు ఇంకా అవగాహన కలిగించాల్సి ఉందన్నారు.
ముఖ్యంగా ఆయా ప్రభుత్వ శాఖలు సంబంధిత వ్యాపారవేత్తలకు అందిస్తున్న సేవలు ఎలా అందిస్తున్నారు అనే విషయం పైన ఒక ప్రశ్నావళి, సమాధానాలు రూపొందించి వ్యాపారవేత్తలు అందరికీ పంపించాలని అందులో ఏమైనా అనుమానాలు ఉన్న వెంటనే సంప్రదించాలని కోరాలన్నారు. ఈ సర్వే ఆధారంగా జిల్లా ర్యాంకు తద్వారా రాష్ట్ర ర్యాంక్ నిర్ణయించబడతాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం సులభతర వాణిజ్యంలో దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వం పరిశ్రమల పాలసీని అమలు విధానానికి 30 శాతం, సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలపై 70% ర్యాంకింగ్ ఉంటుందన్నారు. లబ్ధిదారులైన వ్యాపారవేత్తలకు అన్ని విధాల ఓపికతో అవగాహన కలిగించి సానుకూలంగా స్పందించేలాగా చొరవ చూపాలన్నారు.నిజానికి వ్యాపారవేత్తలకు మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు మరే రాష్ట్రంలోనూ లేవన్నారు.
ప్రభుత్వ విధానమైన ఏకగవాక్ష పద్ధతిలో ఒకే చోట వ్యాపారవేత్తలకు అన్ని రకాల అనుమతులు వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. జిల్లాలోని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎం.ఈ) సంబంధించి మొత్తం 20 పరిశ్రమలకు 3 కోట్ల 30 లక్షల పెట్టుబడి రాయితీ, తిరిగి చెల్లింపు వడ్డీ రాయితీ, ఆమ్మకం పన్ను రాయితీ, స్టాంప్ డ్యూటీ చార్జీల కింద కమిటీ మంజూరు చేసింది.
సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, కే పి ఎం జి కన్సల్టెంట్ సౌమి, కార్మిక శాఖ ఇన్చార్జి డిసి ధనలక్ష్మి, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, మచిలీపట్నం, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, నజీర్, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ తదితర అధికారులు, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.