- కలెక్టర్ ను అభినందించిన జంపాన శ్రీనివాస్ గౌడ్
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి జాతీయ స్థాయిలో ఉత్తమ ఐఏఎస్ అవార్డు రావడం మన జిల్లాకు అత్యంత గర్వకారణం – స్ఫూర్తిదాయకం ➖జంపాన శ్రీనివాస్ గౌడ్
🔴 కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దేశంలో ఉత్తమ ఐఏఎస్ అధికారిగా అవార్డు సాధించండంతోపాటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ( IAS ) అధికారిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యు.ఎఫ్.ఆర్.టి.ఐ అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంపికైన అధికారులలో ప్రత్యేక ప్రతిభ కనబరచి ఉత్తమ ఐఏఎస్ అధికారిగా జాతీయ స్థాయి అవార్డును ఇటీవల అందుకున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో “యునైటెడ్ ఫోరమ్ ఫర్ యు.ఎఫ్.ఆర్టిఐ” ఆధ్వర్యంలో సంస్థ కో కన్వీనర్ జంపాన శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ బాలాజీని సన్మానించారు. దేశంలో ఐఏఎస్ అధికారులకు ముస్సోరిలో నిర్వహించిన మిడ్ క్యారియర్ శిక్షణ కార్యక్రమంలో బాలాజీ నాలుగు వారాలపాటు శిక్షణ పొందారు.
అన్ని విభాగాల్లో సమగ్ర ప్రదర్శన కనబర్చినందుకు ఆయనను ప్రత్యేకంగా గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా యు.ఎఫ్.ఆర్.టి.ఐ తరఫున జంపాన శ్రీనివాస్ గౌడ్,యు.ఎఫ్.ఆర్.టి.ఐ ప్రతినిధులు కలెక్టర్ బాలాజీకి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి, తలపాగా ధరింపజేసి , జ్ఞాపికను ఇచ్చి అభినందనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ..
“ఈ అవార్డు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తన బాధ్యతల నిర్వహణలో మొత్తం జిల్లా యంత్రాంగం చేసిన కృషికి లభించిన గుర్తింపు. ఐఏఎస్ సేవ అంటే కేవలం ఉద్యోగం కాదు, దేశ సేవ చేయడానికి ఒక గొప్ప వేదిక. సమాజ అభివృద్ధికి నేరుగా తోడ్పడే అవకాశం ఇది. యువత దేశ భవిష్యత్తు కోసం ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల్లో చేరి ప్రజల సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.

సత్కార కార్యక్రమం సందర్భంగా జంపాన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్ బాలాజీ అంకిత భావంతో చేస్తున్న కృషి అభినందనీయమని, ఈ అవార్డు ఆయన మేధా సంపత్తి,సామాజిక అంశాల పట్ల అవగాహనకు లభించినట్టు భావించాలి. అలాగే ఐఏఎస్ గా పది సంవత్సరాలు పాటు అందించిన సేవలు , ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా సమాజ ఉన్నతి కోసం చేస్తున కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. “జిల్లా ప్రజలకు ఇది గర్వకారణమని, ఈ సత్కారం ద్వారా యువతకు స్ఫూర్తి లభిస్తుందని జంపాన శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కార్యక్రమంలో యు.ఎఫ్.ఆర్.టి.ఐ.జిల్లా అధ్యక్షులు బయ్యవరపు దుర్గా ప్రసాద్, ఉయ్యూరు మండల కన్వీనర్ బొల్లా శివపార్వతి, ప్రతినిధులు గొల్లపూడి నాగరాజు, చింతా శివ బ్రహ్మేశ్వరరావు, మానేపల్లి దేవి, బత్తుల జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.