- జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన డి.ఎస్.పి
- మహిళల రక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన ఎస్పీ
- మహిళా చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన డిఎస్పీగా కోసూరి ధర్మేంద్ర గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎస్పీ ధర్మేంద్ర జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావును జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మహిళల, చిన్నారుల, విద్యార్ధినుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత మహిళల భద్రత. కనుక మహిళలకు రక్షణ కల్పించడంలో వెనకడుగు వేయొద్దని, మహిళల భద్రత కోసం నూతనంగా ఏర్పాటు చేయబడిన శక్తి టీమ్స్ యొక్క పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మహిళలపై జరిగే లైంగిక దాడుల నుండి వారికి రక్షణ కల్పించాలని తెలిపారు.
విద్యాలయాలు, జనసమూహం ఉన్న ప్రదేశాలలో, గ్రామ, పట్టణ పరిధిలో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రతి ఒక్కరికి మహిళా రక్షణ చట్టాలు గురించి అవగాహన కలిగేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ తెలిపారు.