కృష్ణాజిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో, పౌర హక్కుల రక్షణ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం 1989, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును ఆయన కమిటీ సభ్యులతో చర్చించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఆయన జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎన్ని నమోదయ్యాయి, వాటిలో ఎన్ని చార్జిషీట్లు ఫైల్ చేశారు, కేసులను ఫైల్ చేయడంలో జాప్యానికి గల కారణాలు, ఇప్పటివరకు అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం ఎంత అందించారని ఆయన డివిజన్ల వారీగా సమీక్షించారు.
పౌర హక్కుల రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల నివారణ చట్టం అనేవి అణగారిన వర్గాలపై, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వివక్ష, దౌర్జన్యాలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్న రెండు ముఖ్యమైన భారతీయ చట్టాలు అని, అవి సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
కేసుల పరిష్కారం కోసం సబ్ డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆయన ఆర్డీవోలు, పోలీస్ అధికారులకు సూచించారు. కమిటీ సభ్యులు సైతం కేసులకు సంబంధించిన గ్రామాలలో పర్యటించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ..
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు తక్షణ న్యాయం చేసేలా పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వారికి కుల దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని, క్లిష్టమైన కేసులను తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అధికారులు, కమిటీ సభ్యులకు సూచించారు.
సమావేశంలో డీఆర్వో కె చంద్రశేఖర రావు, కెఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సిహెచ్ రాజా, జి శ్రీనివాసరావు, ధీరజ్ వినీల్, సిహెచ్ శ్రీనివాసరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు షేక్ షాహిద్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, మార్కెటింగ్ ఎడి నిత్యానంద్, ఏపీపీలు కి చంద్రశేఖర రావు, స్నేహ, కమిటీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్, వేణుగోపాల్, మహమ్మద్ బాజీ, నక్క విజయబాబు, పి వెంకటేశ్వరరావు, కొండ నాగేశ్వరరావు, నరేష్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.